- అంతరిక్షంలోకి 'ప్రైవేట్` రాకెట్
- చరిత్ర సృష్టించిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ
ప్రజాశక్తి- సూళ్లూరుపేట రూరల్ : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని మొదటి రాకెట్ ప్రయోగ వేదికపై నుండి శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ స్కై రూట్_ఏరోస్పేస్ దీనిని అభివృద్ధి చేసింది. భారత భూభాగం నుంచి ఒక ప్రైవేట్ భారతీయ స్టారప్ సంస్థ తొలిసారిగా కక్ష్యలోకి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి. భారత భూభాగం నుంచి తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. విక్రమ్-1 నాలుగు దశల రాకెట్. ఇందులో మూడు ఘన ఇంధన దశలు, ఒక ద్రవ ఇంధన దశ ఉన్నాయి. ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అర్ధ గంటలోనే సరిజేశారు. ఆ తర్వాత దీనిని విజయవంతంగా ప్రయోగించడం తో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం కోసం ఇస్రో, ఇన్-స్పేస్ సంస్థలు పూర్తి సహకారాన్ని అందించాయి.
శ్రీహరికోటలో మంత్రి నారా లోకేష్
విక్రం-1 రాకెట్ ప్రయోగం వీక్షించడానికి మంత్రి నారా లోకేష్ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి విచ్చేశారు. ఎంఎల్ఎ డాక్టర్ నెలవల విజయశ్రీ దంపతులు శ్రీసిటీ హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలో చెంగాలమ్మ అమ్మవారిని నారా లోకేష్ దర్శించుకున్నారు.







కామెంట్‌లు (0)