అహ్మదాబాద్ : 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును నాలుగేళ్ల అనంతరం గుజరాత్ హైకోర్టు మంగళవారం సమర్థించింది. నిషేధిత ఇండియన్ ముజాహిద్ (ఐఎం)కి చెందిన 38మందికి మరణశిక్ష, మరో 11మందికి జీవిత ఖైదు విధిస్తూ 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.వై.కోగ్జే, జస్టిస్ సమీర్ దేవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. నిందితులకు శిక్షను ఖరారు చేయడంతో పాటు బాధితులకు, మృతుల కుటుంబాలకు 2027 మార్చి 30లోగా పరిహారం అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాల్సిందిగా డివిజన్ బెంచ్ ఆదేశించింది.
2008 జూలై 26న అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 70 నిమిషాల వ్యవధిలో 21 వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్లలో గాయపడిన వారిని చికిత్స కోసం తరలించిన ఆసుపత్రుల్లో కూడా పేలుళ్లు జరిగాయి. ఉగ్రదాడిలో ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకోవడం ఇదేమొదటిసారి. అహ్మదాబాద్‌లో జరిగిన 21 పేలుళ్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, సూరత్‌లో లభించిన పేలని పేలుడు పదార్థాలకు సంబంధించి నమోదైన 15 కేసులను కలిపి మొత్తంగా 35 కేసులపై ప్రత్యేక న్యాయస్థానం ఉమ్మడి విచారణ చేపట్టింది. 78మందిపై విచారించగా, వీరిలో 49మందిని దోషులుగా నిర్థారించింది. దోషుల్లో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఎంఐ) మాజీ నేత సఫ్ధర్ నాగోరీ సహా గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, యుపి, ఇతర రాష్ట్రాలకు చెందిన సహచరులు కూడా ఉన్నారు.








కామెంట్‌లు (0)