సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాహుల్‌గాంధీ 'విద్యార్థుల గళం' కార్యక్రమాన్ని అడ్డుకున్న యోగి ప్రభుత్వం

4 రోజుల క్రితం

Rahul Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : కాంగ్రెస్‌ నేత,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో శనివారం నిర్వహించనున్న'విద్యార్థుల గళం' (ఛాత్రోన్ కీ గూంజ్) కార్యక్రమాన్ని యోగి ప్రభుత్వం అడ్డుకుంది. ఆ కార్యక్రమానికి గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు కాయస్థ పాఠశాల (కె.పి) ట్రస్ట్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని కె.పి.గ్రౌండ్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమంలో పరీక్షా పత్రాల లీకేజీలు,విద్యార్థుల సమస్యలపై రాహుల్‌ గాంధీ విద్యార్థులతో చర్చించాల్సి ఉంది.అయితే వేదిక వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదని ట్రస్ట్ ప్రకటించింది. కె.పి.కాలేజీ మైదానాన్ని క్రీడలు,విద్యా సంబంధిత కార్యక్రమాలకు తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని అలహాబాద్‌ హైకోర్టు గత ఏడాది ఆగస్టు14న ఆదేశించిందని ట్రస్ట్‌ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్‌ చౌదరి తెలిపారు.వర్షం కారణంగా మైదానం పూర్తిగా నీటితో నిండిపోయిందని,బహిరంగ సభ నిర్వహించడం సురక్షితం కాదన్నారు.కాంగ్రెస్‌కు ఇచ్చిన అనుమతి కూడా జిల్లా మేజిస్ట్రేట్‌ ఆమోదానికి లోబడి ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు అజయ్‌ రాయ్‌ బుధవారం ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు.రాహుల్‌ గాంధీకి భయపడే యోగి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.గతంలో కోటా,డెహ్రాడూన్‌లలో కూడా రాహుల్‌ గాంధీ కార్యక్రమాలకు ఇదే తరహాలో ఆటంకాలు కల్పించారని పేర్కొన్నారు.ట్రస్ట్‌ అనుమతి రద్దు చేసినప్పటికీ రాహుల్‌ గాంధీ శనివారం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి విద్యార్థులతో సమావేశమవుతారని స్పష్టం చేశారు.కార్యక్రమం కోసం ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు అజయ్‌ రాయ్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్