న్యూఢిల్లీ : కావేరీ జల వివాదంపై త్వరగా విచారణ జరపాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎదుట తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ హాజరై, కావేరీ నీటి కేటాయింపులో ఏర్పడిన లోటు కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను గురువారం విచారణకు సుప్రీంకోర్టు జాబితా చేసింది.
కబిని, కృష్ణరాజ సాగర్ (కేఆర్‌ఎస్) జలాశయాల నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్న కేంద్ర జల నిర్వహణ ప్రాధికార సంస్థ (సిడబ్ల్యుఎంఎ) జూలై 30న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేలా కర్ణాటకను ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆగస్టు 12వ తేదీ లేదా అంతకంటే ముందుగా 15 రోజుల పాటు 3,500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4.536 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తన పిటిషన్‌లో పేర్కొంది. అదే సమయంలో జూన్ 1 నుంచి ఆగస్టు 12 వరకు బిల్లిగుండ్లు అంతర్రాష్ట్ర నీటి కొలత కేంద్రం వద్ద ఏర్పడిన నీటి కొరతను దామాషా పద్ధతిలో భర్తీ చేసేలా కర్ణాటకను ఆదేశించాలని, ఇందుకోసం తక్షణమే 26.954 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సిడబ్ల్యుఎంఎకు తగిన ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు కోరింది. కర్ణాటకలోని జలాశయాల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలను ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షించి, బిల్లిగుండ్లు వద్ద నిర్ణయించిన నెలవారీ, రోజువారీ నీటి విడుదలలు జరిగేలా చూడాలని కూడా సిడబ్ల్యుఎంను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.
వరదల కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు అనివార్యంగా పెరిగిన సందర్భాలను మినహాయిస్తే, పొరుగు రాష్ట్రానికి నీటి కేటాయింపునకు సంబంధించి కావేరీ ట్రిబ్యునల్ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం నిరంతరం ఉల్లంఘిస్తోందని తమిళనాడు ఆరోపించింది. కావేరీ పరీవాహక ప్రాంతంలోని నీటి, వాతావరణ పరిస్థితులను జూలై 30న సమీక్షించినట్లు పేర్కొంది. అంతకుముందు జులై 28న కావేరీ నీటి నియంత్రణ కమిటీ (సిడబ్ల్యుఆర్‌సి) చేసిన సిఫార్సుల మేరకు కృష్ణరాజ సాగర్, కబిని జలాశయాల నుంచి జులై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
కర్ణాటక 15 రోజుల పాటు 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినప్పటికీ, జులై 28న అంచనా వేసిన నీటి కొరతలో కేవలం 4.536 టీఎంసీలను మాత్రమే భర్తీ చేయగలదని, దీంతో 5.379 టీఎంసీల లోటు మిగిలిపోతుందని తమిళనాడు పేర్కొంది. ఆగస్టు 3, 2026 వరకు కర్ణాటకలోని నాలుగు ప్రధాన జలాశయాలకు వచ్చిన నీటి ప్రవాహాలను గత 30 ఏళ్ల సగటుతో పోల్చితే నీటి లభ్యత నిష్పత్తి 46.34 శాతంగా ఉందని తెలిపింది. ఈ నిష్పత్తి ఆధారంగా జూన్ 1 నుంచి ఆగస్టు 12 వరకు రావాల్సిన నీటి పరిమాణం 26.954 టీఎంసీలుగా లెక్కించినట్లు పేర్కొంది. అయితే సిడబ్ల్యుఆర్‌సి, సిడబ్ల్యుఎంఎలు కేవలం 4.536 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించాయని, ఇది వాస్తవంగా రావాల్సిన నీటి పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువని తమిళనాడు వాదించింది. సిడబ్ల్యుఆర్‌సి, సిడబ్ల్యుఎంఎ జోక్యం చేసుకున్నప్పటికీ జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు బిల్లిగుండ్లు వద్ద నమోదైన నీటి ప్రవాహం కేవలం 158 నుంచి 530 క్యూసెక్కుల మధ్య మాత్రమే ఉందని తమిళనాడు తెలిపింది. దీన్ని బట్టి కర్ణాటక ఉద్దేశపూర్వకంగానే కేంద్ర జల సంస్థల ఆదేశాలను పాటించలేదని ఆరోపించింది. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్‌ఎస్‌లో 23.078 టీఎంసీలు, కబినిలో 18.610 టీఎంసీలు, హరంగిలో 7.827 టీఎంసీలు, హేమావతిలో 28.022 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, నాలుగు జలాశయాల్లో కలిపి 77.537 టీఎంసీల స్థూల నిల్వ ఉందని పేర్కొంది. కబిని, కేఆర్‌ఎస్ ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ వినియోగించదగిన నీటి నిల్వలు మరింత పెరిగాయని, తగినంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కర్ణాటక సిడబ్ల్యుఆర్‌సి ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైందని తమిళనాడు తన పిటిషన్‌లో పేర్కొంది.








కామెంట్‌లు (0)