న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్త సోనమ్‌వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్రమంత్రులు జె.పి.నడ్డా, జితేంత్ర సింగ్‌లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ చేపడతామని, విద్యా సంస్కరణల అంశంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ విధానాలపై విశ్వాసం ఉంచాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకుండా చూడాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేయాలని వాంగ్‌చుక్‌ను కోరినట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్‌చుక్‌ను మంగళవారం సఫ్దర్‌గంజ్ నుండి ప్రైవేట్ ఆస్పత్రి మేదాంతకు తరలించిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం కూడా జంతర్‌మంతర్‌కు పలువురు విద్యార్థులు చేరుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) జంతర్‌మంతర్‌లోని నిరసన ప్రాంతాన్ని పునరుద్ధరించింది. కేంద్రం కోల్‌కతా నుండి 20 సిఆర్‌పిఎఫ్ బృందాలను విమానాల ద్వారా ఢిల్లీకి తరలిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత
మొదట నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేసిన ప్రభుత్వం.. మరో 12 స్టేషన్లను మూసివేయాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు మొత్తం 16 స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.








కామెంట్‌లు (0)