మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత - నేడు అంత్యక్రియలు

31 జులై, 2026

Funeral of renowned singer Jamuna Rani today.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 09:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

బెంగళూరు : దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కోక జమునారాణి (88) కన్నుమూశారు. గురువారం బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లహళ్లిలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి చిన్న వయసులోనే సంగీతంపై అసాధారణ ప్రతిభ కనబరిచారు. కేవలం ఏడేళ్ల వయసులోనే గాయనిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, 1946లో విడుదలైన క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ ద్వారా బాలనటిగా, నేపథ్య గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.


ఎపి లో జన్మించిన ఆమె 1946 లో 'త్యాగయ్య' చిత్రంతో గాన ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో 6 వేలకు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ‘ఎంత టక్కరి వాడు నారాజు’, ‘సరదా సరదా సిగరెట్టు’, ‘ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం’ వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆమె సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం అన్నాదురై పురస్కారం, కలైమామణి అవార్డులతో జమునా రాణిని సత్కరించింది.


తన సుదీర్ఘ కెరీర్‌లో జమునారాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో కలిపి 6 వేలకుపైగా పాటలు ఆలపించారు. 1940ల నుంచి 1980ల వరకు అనేక మంది అగ్ర హీరోలు, ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేస్తూ తన గాత్రంతో ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించారు. ఆమె కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో ‘దేవదాసు’ చిత్రంలోని “ఓ దేవత”, “చెలియ లేదు.. చెలిమి లేదు, అభిమానం లోని పద పదవే వయ్యారి గాలిపటమా, మంచి మనసులు లోని మామ మామ మామా... ఏమే ఏమే భామా... , రాముడు భీముడు లోని సరదా సరదా సిగరెట్టు, లవకుశ లోని విరిసే చల్లని వెన్నెల , బంగారు తిమ్మరాజు లోని నాగమల్లి కోనలోన నక్కింది లేడి కున వంటి ఎన్నో సూపర్ హిట్ గీతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే ‘ద్రోహి’, ‘రత్నమాల’, ‘లైలా మజ్ను’, ‘చంద్రమతి’, ‘దేవదాసు’, ‘సంతానం’, ‘అలీబాబా 40 దొంగలు’, ‘వద్దంటే పెళ్లి’, ‘బడిపంతులు’, ‘అన్నా తమ్ముడు’, ‘బంగారు తిమ్మరాజు’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె ఆలపించిన పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. 1987లో విడుదలైన దర్శకుడు మణిరత్నం క్లాసిక్ చిత్రం నాయకుడు లో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆమె ఆలపించిన “నా నవ్వే దీపావళి” పాట కూడా ఆమె గొప్ప గాత్ర ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తెలుగు సినీ సంగీతానికి మాత్రమే కాకుండా దక్షిణ భారత సంగీత సంపదకు తన గాత్రంతో అపూర్వ సేవలందించిన జమునారాణి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పాడిన వేలాది పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, ఆమెను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్