ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మల్లారెడ్డి మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం

24 ఆగస్టు, 2026

Sarampalli Mallareddy was a leader who fought for the rights of the working class until the very end of his life: V. Srinivasa Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రముఖ రైతు నాయకులు, తెలంగాణా సిపిఎం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి,శ్రీనివాసరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో విచ్ఛిన్నమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని తిరిగి పునర్ నిర్మించడంలోనూ, రాష్ట్రంలో రైతు సంఘాన్ని బలపరచడంలోనూ మల్లారెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. కష్టజీవుల హక్కుల కోసం జీవిత చరమాంకం వరకు అంకిత భావంతో పోరాడారని, వారి కుటుంబాన్ని కూడా పార్టీ ఆశయాలతో నిలబెట్టారని తెలిపారు. తాను రాష్ట్ర యువజన సంఘం బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిందని, వరంగల్ లో జరిగిన యువజన ఉత్సవాల సందర్భంగా కలిసిమెలిసి పనిచేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర రైతు ఉద్యమం బాధ్యతల్లో ఆయనతో సాహచర్యం ఏర్పడిందని, తన సహచరులు అందరితోనూ చిన్న పెద్ద భావం లేకుండా స్నేహపూర్వకంగా ఉండేవారని పేర్కొన్నారు. మల్లారెడ్డి రాష్ట్ర కేంద్రానికి వచ్చిన తర్వాత తామిద్దరం ఒక టీముగా రైతు సంఘం విస్తరణకు కృషి చేశామని, ఆ తర్వాత చనిపోయేంతవరకు ఆయన రైతుల కోసం, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. ఆఖరి శ్వాస వరకు అధ్యయనం చేస్తూనే ఉన్నారని, ఇటీవల కుమార్తె చనిపోవడం ఆయనను ఎంతగానో కృంగదీసిందని తెలిపారు. ఆయనకు సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున, వ్యక్తిగతంగా తన తరఫున జోహార్లు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి భాగ్యలక్ష్మికి, వారి కుమారులు వాసు, మధుసూదన్కు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు శ్రీనివాసరావు సానుభూతి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్