శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

GOLD - బ్యాంకులకు కొత్త తలనొప్పి !

13 గంటల క్రితం

A new headache for banks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 12:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్లపై బ్యాంకుల గుబులు !

తగ్గుతున్న తనఖా బంగారం విలువతో రుణదాతల్లో ఆందోళన

పాత రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి

అదనపు బంగారం లేదా నగదు చెల్లించాలని కోరే అవకాశం


బిజినెస్ : బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం పసిడి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నా.. బంగారాన్ని తనఖా పెట్టి రుణాలిచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ధరల పతనంతో ఇప్పటికే తనఖాలో ఉన్న బంగారం విలువ తగ్గుతుండటంతో, ఇచ్చిన రుణాలకు తగిన భద్రత ఉంటుందా ? అన్న ఆందోళన రుణ సంస్థల్లో వ్యక్తమవుతోంది.


అత్యవసర అవసరాల కోసం సామాన్యులు, చిరు వ్యాపారులు తమ బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందుతుంటారు. ఈ రుణాల మంజూరులో లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి కీలకం. ఉదాహరణకు.. రూ.1.50 లక్షల విలువైన బంగారంపై 75 శాతం ఎల్‌టీవీ ప్రకారం రూ.1,12,500 వరకు రుణం ఇవ్వవచ్చు. అదే బంగారం ధర తగ్గి దాని విలువ రూ.1.25 లక్షలకు చేరితే, నిబంధనల ప్రకారం రుణ అర్హత రూ.93,750కు పడిపోతుంది. అంటే గతంలో ఇచ్చిన రుణంతో పోలిస్తే భద్రతా విలువ తగ్గినట్లవుతుంది.


ఇటీవలి ధరల గణాంకాల ప్రకారం .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.4,700 క్షీణించి రూ.1,15,100 వద్ద, 18 క్యారెట్ల ధర రూ.3,840 తగ్గి రూ.94,180 వద్ద కొనసాగుతోంది. ఈ తగ్గుదల కొత్తగా గోల్డ్ లోన్ తీసుకునేవారికి లభించే రుణ మొత్తంపైనా ప్రభావం చూపుతోంది.


మరోవైపు రానున్న రోజుల్లో బంగారం ధరలు మరో 15 శాతం వరకు తగ్గవచ్చన్న అంచనాలు రుణ సంస్థలను మరింత కలవరపెడుతున్నాయి. ధరలు మరింత పడిపోతే, రుణగ్రహీతలు చెల్లింపుల్లో విఫలమైన సందర్భంలో తనఖా బంగారాన్ని వేలం వేసినా అసలు, వడ్డీ పూర్తిగా రాబట్టుకోవడం కష్టమవుతుందనే భయం నెలకొంది.


దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పాత రుణాలపై నిఘా పెంచుతున్నాయి. బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతోపాటు, రుణ భద్రతా నిష్పత్తిని పర్యవేక్షిస్తున్నాయి. పరిస్థితులను బట్టి కొందరు ఖాతాదారులను అదనపు బంగారం తనఖా పెట్టాలని లేదా కొంత మొత్తాన్ని చెల్లించి రుణాన్ని తగ్గించుకోవాలని కోరే అవకాశం ఉంది.


అయితే ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో పసిడి మళ్లీ పుంజుకోవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గోల్డ్ లోన్ తీసుకున్నవారు తమ రుణ ఖాతా వివరాలు, వడ్డీ చెల్లింపులు, గడువులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సకాలంలో చెల్లింపులు జరపడం ద్వారా అదనపు ఆర్థిక భారాన్ని, తనఖా బంగారం వేలం ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్