పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన పసిడి ధర
గరిష్ఠ స్థాయి నుంచి తగ్గినా కొనుగోలు భారమే!
బిజినెస్: కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతోందన్న వార్త కొంత ఊరటనిస్తున్నా, సామాన్యులకు ఇంకా అందనంత దూరంలోనే ఉంది. పదేళ్ల క్రితం తులం బంగారం కొనడానికి రూ.30 వేల లోపు ఖర్చు చేస్తే సరిపోయేది. ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.1.26 లక్షలకు పైగా ఉంది. గత రెండేళ్లలోనే ధర అసాధారణంగా పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరిన ధర ఇప్పుడు గణనీయంగా పడిపోతున్నప్పటికీ, గత దశాబ్దంలో నమోదైన పెరుగుదలతో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పమే!
పదేళ్లలో నాలుగు రెట్లు..
బంగారం ధర పెరుగుదలను పరిశీలిస్తే గత దశాబ్దంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
సంవత్సరం 10 గ్రాముల ధర
2016 రూ.28,937
2017 రూ.29,615
2018 రూ.31,438
2019 రూ.38,019
2020 రూ.50,358
2021 రూ.48,860
2022 రూ.52,599
2023 రూ.60,537
2024 రూ.75,890
2025 రూ.1,23,604
2026 నవంబర్ 21 నాటికి సుమారు రూ.1,26,000
2016లో పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.29 వేలుండగా, 2026 జనవరిలో దేశీయ మార్కెట్లో రూ.1.80 లక్షలకు చేరువగా నమోదైంది. గత పదేళ్లలో నాలుగు రెట్లకు పైగా పెరిగింది. 2016 ధరతో పోలిస్తే ప్రస్తుత ధర సుమారు 332 శాతం పెరిగింది. ఈ ఏడాది గరిష్ఠ స్థాయితో పోలిస్తే మాత్రం ధర సుమారు 30 శాతం తగ్గింది.
పెరుగుదలకు కారణాలు
- ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరుగుతున్న సంక్షోభం, ఆర్థిక అస్థిరతతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారం వైపు మళ్లుతున్నారు.
- రష్యా విదేశీ నిల్వలను అమెరికా తదితర దేశాలు స్తంభింపజేసిన నేపథ్యంలో, డాలర్ ఆధారిత వ్యవస్థలో తమ ఆస్తులకు ముప్పు ఉంటుందనే భయంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
- పశ్చిమాసియా ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని పెంచి బంగారాన్ని భద్రతా ఆస్తిగా మార్చుతున్నాయి.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వాణిజ్యం, ఉపాధి కంటే ఆర్థిక ఆస్తులపై ఆధారపడటం పెరుగుతోంది. ఈ ఫైనాన్షియలైజేషన్ ధోరణి బంగారం డిమాండ్‌ను పెంచుతోంది.
- ధర మరింత పెరుగుతుందనే అంచనాలతో ఇటిఎఫ్‌లు, ఫ్యూచర్స్ వంటి సాధనాల్లో పెట్టుబడులు పెంచడం ఊహాజనిత డిమాండ్‌ను సృష్టిస్తోంది.
ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది?
- అమెరికా డాలర్ బలపడటంతో ఇతర దేశాల పెట్టుబడిదారులకు డాలర్లలో కొనుగోలు చేసే బంగారం ఖరీదైనదిగా మారింది. దీంతో డిమాండ్ తగ్గింది.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. బంగారం వడ్డీ రాబడి ఇవ్వని ఆస్తి కావడంతో వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు వంటి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయి. ఇది బంగారం పెట్టుబడులపై ఆసక్తిని తగ్గిస్తోంది.
- గత కొన్నేళ్లగా బంగారం కొన్న మదుపుదారులు లాభాలను స్వీకరించేందుకు విక్రయాలు చేస్తున్నారు. ఈ అమ్మకాలు ధర తగ్గుదలకు కొంత కారణం.
- ఇతర మార్కెట్లలో నష్టాలు ఎదురైనప్పుడు నగదు సమకూర్చుకోవడానికి బంగారాన్ని విక్రయించడం కూడా మరొక కారణం.
సామాన్యులకు భారం
బంగారం ధర పెరగడం మదుపుదారులకు లాభదాయకంగా కనిపించినా, కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేసేవారికి మాత్రం చాలా భారంగా మారింది. వివాహాలు, పండుగలు, కుటుంబ సంప్రదాయాల కోసం బంగారం కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో తమ కొనుగోళ్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025లో మనదేశంలో బంగారం కొనుగోళ్లు 2024తో పోలిస్తే 24 శాతం తగ్గాయి. 2024లో 563.4 టన్నుల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, 2025లో 430.5 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం తగ్గాయి.
ధర ఇంకా తగ్గుతుందా?
అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే, డాలర్ మరింత బలపడితే బంగారం ధర మరింత తగ్గవచ్చు. ఇప్పటికే గరిష్ఠ ధర నుంచి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్ల మద్దతుతో మధ్యలో ధర కోలుకునే అవకాశమూ ఉంది. ప్రస్తుత పతనాన్ని అసాధారణ పెరుగుదల తర్వాత జరుగుతున్న మార్కెట్ సర్దుబాటుగా చూడాలి.
- ప్రజాశక్తి ఫీచర్స్ డెస్క్








కామెంట్‌లు (0)