సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత వృద్ధికి ఎల్‌‌నినో దెబ్బ

43 నిమిషాల క్రితం

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జిడిపి 7 శాతానికి తగ్గొచ్చు

- వడ్డీ రేట్లు పెరగొచ్చు

- ఎస్‌అండ్‌‌పి రిపోర్ట్‌

‌న్యూఢిల్లీ : ​భారత జిడిపిని ఎల్‌‌నినో దెబ్బతీయనుందని గ్లోబల్‌ ‌రేటింగ్‌ ఎజెన్సీ ఎస్‌అండ్‌‌పి హెచ్చరించింది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 7 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ 2027లో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌, వియత్నాం ముందుంటాయని తెలిపింది. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో డిసెంబర్‌లో ఆర్‌‌బిఐ మరో 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంచొచ్చని విశ్లేషించింది. జులై–సెప్టెంబర్‌ త్రైమాసిక జిడిపి గణాంకాలను నవంబర్‌ 30న ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. ఈ త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి ఉంటుందని ఆర్‌బిఐ గతంలో అంచనా వేయగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ 7.35 శాతంగా ఉండొచ్చని తెలిపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో వృద్ధి, ద్రవ్యోల్బణ సమతుల్యత ప్రతికూలంగా మారవచ్చని ఎస్‌అండ్‌పి హెచ్చరించింది. ముడి సరుకుల ధరలు, ఇతర ఉత్పాదక వ్యయాలు పెరగడంతో వాటి ప్రభావాన్ని కంపెనీలు వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షపాత లోటు, జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు, ఎల్‌నినో పరిస్థితులు ప్రస్తుత వ్యవసాయ ఉత్పత్తితో పాటు రాబోయే రబీ పంట దిగుబడులపైనా ప్రభావం చూపవచ్చని తెలిపింది. దీంతో ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత తీవ్రం కావచ్చని అంచనా వేసింది. 2026-27 మార్చి వరకు సగటు ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఈ అంచనాలో పైకి పెరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.1 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో 25 బేసిస్‌ పాయింట్లు, 2027 ప్రారంభంలో మరోసారి 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంపు ఉండవచ్చని ఎస్‌అండ్‌పి భావిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్