సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐటి ఉద్యోగం వదిలేస్తాం..!

41 నిమిషాల క్రితం

job
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 10:04 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • భారత్‌లో 72 శాతం టెకీల వెల్లడి

  • కెరీర్‌ మారేందుకు యోచన

  • వెంటాడుతోన్న ఎఐ భయాలు..

  • ఉద్యోగ కోతలతో అసంతృప్తి

  • పిల్లలకు ఐటి ఆలోచనలు వద్దు

  • వైద్య రంగానికి తొలి ప్రాధాన్యత

  • బ్లైండ్‌ సర్వేలో వెల్లడి

ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : అధిక వేతనాలు.. అంతర్జాతీయ అవకాశాలు.. ఆకర్షణీయమైన కెరీర్‌.. ఒకప్పుడు యువత కలల రంగంగా వెలిగిన ఐటి ఇప్పుడు సొంత ఉద్యోగుల్లోనే విశ్వాసాన్ని కోల్పోతోంది. ఉద్యోగ కోతలు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, కృత్రిమ మేధ (ఎఐ)తో ఉద్యోగ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి టెక్‌ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు ప్రత్యామ్నాయ ‌వృత్తుల వైపు ఆలోచిస్తున్నారు. ప్రస్తుత వృత్తిని పూర్తిగా వదిలి మరో రంగంలోకి వెళ్లేందుకు భారత్‌లో 72 శాతం మంది టెక్‌ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొనసాగేందుకు కేవలం 13 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఇది ఈ రంగంలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. భారత్‌లోని 2,958 మంది ఉద్యోగులతో ‘బ్లైండ్‌’ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఉద్యోగులు తమ పేరు లేదా గుర్తింపు బయటపెట్టకుండా తమ కంపెనీలు, ఉద్యోగ విషయాల గురించి చర్చించుకునే ఇది ఒక ఆన్‌లైన్ వేదిక. మరో వృత్తిలోకి వెంటనే మారేందుకు 30 శాతం మంది సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత వేతనమే కొనసాగితే కెరీర్‌ మార్చుకుంటామని 42 శాతం మంది పేర్కొన్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే తమ ప్రస్తుత వృత్తిలో సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. మార్పు గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి, భవిష్యత్తులో నైపుణ్యాల అవసరాలు మారుతుండటం వంటి అంశాలు ఉద్యోగుల కెరీర్‌ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడయ్యింది. నవంబర్‌ 6 నుంచి 19 వరకు బ్లైండ్‌ ‌చేసిన సర్వేలో 2,958 మంది భారతీయ ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. ​

తమ పిల్లలను టెక్నాలజీ రంగంలోకి రావాలని ప్రోత్సహించబోమని 56 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇందులో దాదాపు మూడింట ఒక వంతు మంది కచ్చితంగా ఐటి రంగాన్ని ఎంచుకోవద్దని పిల్లలకు సూచిస్తామన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల్లోనూ 67 శాతం మంది తమ పిల్లలను టెక్‌ రంగానికి దూరంగా ఉండాలని సూచించారు. గూగుల్‌, అమెజాన్‌ ఉద్యోగుల్లోనూ సగానికి పైగా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.​

కెరీర్‌ మార్పు ఆలోచన కొన్ని ప్రముఖ సంస్థల ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా కనిపించింది. ఇంట్యూట్‌ ఉద్యోగుల్లో 89 శాతం, గోల్డ్‌మన్‌ శాక్స్‌, పేపాల్‌ ఉద్యోగుల్లో 87 శాతం, వీసాలో 86 శాతం, ఎక్స్‌పీడియా గ్రూప్‌లో 83 శాతం మంది మరో వృత్తిలోకి మారాలని కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. ఒరాకిల్‌, సేల్స్‌ఫోర్స్‌లో 79 శాతం, అడోబ్‌లో 78 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒరాకిల్‌ భారత్‌లో ఈ ఏడాది సుమారు 12 వేల ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదిక ప్రస్తావించింది.

​అబ్బే వద్దు..!

​నేటి యువత కెరీర్‌ ప్రారంభించేటప్పుడు ఏ రంగాన్ని ఎంచుకోవాలని సిఫారసు చేస్తారని అడిగిన ప్రశ్నకు వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యధికంగా 34 శాతం మంది మొగ్గు చూపారు. ఎఐ, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాలకు 19 శాతం, ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్‌ సెక్టార్‌కు 15 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. డేటా, సైబర్‌ సెక్యూరిటీ, హార్డ్‌వేర్‌ వంటి ఇతర టెక్నాలజీ రంగాలకు 10 శాతం, న్యాయ, ఆర్థిక రంగాలకు 10 శాతం, కళలు, బోధన రంగాలకు 8 శాతం మంది సిఫారసు చేశారు. కేవలం 4 శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి తగ్గుతున్నప్పటికీ ఎఐ, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాలకు మాత్రం 19 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా ఉద్యోగ భద్రత, సాంకేతిక మార్పుల ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు, దీర్ఘకాలిక ఆదాయ స్థిరత్వంపై ఉద్యోగులు దృష్టి పెడుతున్నట్లు స్పష్టమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్