శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడుల వృద్ధి..

25 నిమిషాల క్రితం

fdi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 10:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏడాదిలో 40.8 శాతం పెరుగుదల

- యుఎఇలో ఏకంగా తొమ్మిది రెట్లు వృద్ధి

న్యూఢిల్లీ : ​భారతీయ కంపెనీలు విదేశాల్లోనే పెట్టుబడులకు ఎక్కువగా ఆసక్తి కనబర్చు తున్నాయి. 2026 మార్చి నాటికి వాటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఒడిఐ) నిల్వ విలువ ఏడాదిలో 40.8 శాతం పెరిగి రూ.16.71 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది మార్చిలో ఇది రూ.11.87 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.4.85 లక్షల కోట్ల మేర పెరిగింది. అయితే ఈ విస్తరణలో యుఎఇలో పెట్టుబడులు అనూహ్యంగా పెరగడం విశేషం. ముఖ్యంగా రుణ పెట్టుబడుల వాటా భారీగా ఎగబాకినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బిఐ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

​సింగపూర్‌‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టారు. అక్కడ భారతీయ కంపెనీల పెట్టుబడుల నిల్వ 37 శాతం పెరిగి రూ.3.52 లక్షల కోట్లకు చేరింది. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్‌ వాటా 21.1 శాతంగా ఉంది. అయితే యుఎఇలో పెట్టుబడులు ఏకంగా 160 శాతం పెరిగి రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.2.71 లక్షల కోట్లకు చేరాయి. దీంతో అమెరికా, బ్రిటన్‌లను వెనక్కి నెట్టి రెండో అతిపెద్ద గమ్యస్థానంగా అవతరించింది. అమెరికాలో పెట్టుబడులు 32.7 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్లకు, బ్రిటన్‌లో 28.4 శాతం వృద్ధితో రూ.2.07 లక్షల కోట్లకు చేరాయి.

​యుఎఇలో పెరిగిన పెట్టుబడుల్లో రుణాల వాటా అత్యంత కీలకంగా ఉంది. అక్కడ భారతీయ కంపెనీల రుణ పెట్టుబడులు రూ.17,644 కోట్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎగబాకాయి. ఇదే సమయంలో ఈక్విటీ పెట్టుబడులు రూ.86,593 కోట్ల నుంచి రూ.1.18 లక్షల కోట్లకు చేరాయి. విదేశాల్లో భారతీయ కంపెనీల రుణ పెట్టుబడుల పెరుగుదలలోనూ యుఎఇ వాటా ఐదింట నాలుగు వంతులకు మించి ఉండటం విశేషం. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో నాలుగు దేశాల వాటానే 63.6 శాతంగా ఉంది. సింగపూర్‌, యుఎఇ, అమెరికా, బ్రిటన్‌లతో పాటు నెదర్లాండ్స్‌, మారిషస్‌లను కలిపితే దాదాపు 80శాతం పెట్టుబడులు ఈ ఆరు అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. నెదర్లాండ్స్‌లో పెట్టుబడులు 20.1 శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లకు, మారిషస్‌లో 30.4 శాతం వృద్ధితో రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు చైనాలో భారతీయ కంపెనీల పెట్టుబడులు కేవలం రూ.12,373 కోట్లకే పరిమితమయ్యాయి. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో వాటి వాటా 0.7 శాతంగా ఉంది. విదేశాలకు తరలుతున్న పెట్టుబడి నిధుల్లో అసలు లబ్ధిదారులు ఎవరు? ఏ రంగాలకు, ఎలాంటి కార్యకలాపాలకు ఈ మూలధనం వెళ్తోంది? అనే అంశాలపై ఆర్‌‌బిఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్