స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 20 శాతం పతనం
రియల్‌మీకి భారీ దెబ్బ
న్యూఢిల్లీ : అధికంగా పెరిగిన ధరలు స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా దెబ్బతీశాయి. దీపావళి పండుగ సీజన్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఆదాయాల్లోనూ వృద్ధి లేకపోవడంతో ఆ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశీయ ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌లో విక్రయాల పరిమాణం ఏకంగా 18–20 శాతం పడిపోయింది. ధరల పెరుగుదల, వినియోగదారుల నుంచి మందగించిన డిమాండ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విక్రయ వేదికల మధ్య ధరల వ్యత్యాసాలు రిటైల్ వ్యాపారాన్ని దెబ్బతీశాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఎఐఎంఆర్‌ఎ) వెల్లడించింది. అయితే అమ్మకాల పరిమాణం తగ్గినప్పటికీ.. మొత్తం విక్రయాల విలువ మాత్రం గత ఏడాది స్థాయిలోనే నమోదయ్యాయని పేర్కొంది.
ఎఐఎంఆర్‌ఎ నివేదిక ప్రకారం.. ధంతేరస్ నుంచి దీపావళి మరుసటి రోజు వరకు నాలుగు రోజుల పాటు దుకాణాలకు కొనుగోలుదారుల రాక బాగానే ఉంది. అయితే అంతకుముందు వారం రోజుల్లో పండుగ ఆఫర్ల కోసం వినియోగదారులు కొనుగోళ్లను చివరి నిమిషం వరకు వాయిదా వేయడంతో అమ్మకాల పరిమాణం దాదాపు 40 శాతం తగ్గింది. డిస్కౌంట్లు, ఆఫర్లు మినహాయించిన తర్వాత రూ.30 వేల నుంచి రూ.60 వేల ధరల శ్రేణిలో అత్యధిక లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రీమియం విభాగంలో కొనుగోళ్లు జరిగాయి.
బ్రాండ్ల వారీగా పరిశీలిస్తే రియల్‌మీ అత్యధికంగా నష్టపోయిన సంస్థగా నిలిచింది. ఈ బ్రాండ్ విక్రయాల పరిమాణం 50 శాతానికిపైగా పడిపోయాయి. మరోవైపు ఆపిల్, మోటరోలా బలమైన విక్రయాలను నమోదు చేశాయి. ధరల పెంపునకు ముందున్న పాత ధరలకే ఐఫోన్ 15, 16, 17 మోడళ్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లకూ స్పందన లభించింది. ప్రీమియం విభాగంలో గూగుల్ పిక్సెల్ వేగంగా విస్తరిస్తుండగా.. పోటీ ధరలతో రెడ్‌మీ నోట్ 17 సిరీస్ ద్వారా షావోమి యథాతథ అమ్మకాలను సాధించింది.
సామ్‌సంగ్ సహా పలు బ్రాండ్లకు ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ ధరల వ్యత్యాసాలు ప్రతికూలంగా మారాయి. ఆన్‌లైన్ వేదికల్లో భారీ డిస్కౌంట్లు లభించడంతో సంప్రదాయ రిటైల్ దుకాణాలు పోటీలో వెనుకబడ్డాయి. వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించడం.. పండుగకు ముందే ఫోన్ల ధరలు పెరగడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపాయి. పండుగ రద్దీ ఉన్నప్పటికీ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం మొబైల్ రిటైల్ రంగంలో వినియోగదారుల డిమాండ్ బలహీనతను సూచిస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో ఓ అతిపెద్ద మొబైల్ రిటైల్ చెయిన్ స్టోర్లలోనూ అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది పెద్ద ఆఫర్లేమీ పెట్టకపోవడం వినియోగదారులను నిరుత్సాహానికి గురి చేసింది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రముఖ ఎలక్ర్టానిక్స్ కంపెనీలు వాణిజ్య ప్రకటనలను కూడా తగ్గించాయని ఆ వర్గాలు వెల్లడించాయి.








కామెంట్‌లు (0)