గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదిగ్గజ కంపెనీల్లో ఉద్యోగ కోతలు

20 గంటల క్రితం

క్వాల్‌కామ్‌లో1,000 మందిపై వేటు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • క్వాల్‌కామ్‌లో1,000 మందిపై వేటు

  • పెప్సీకోలోనూ ఉద్వాసనలు

హైదరాబాద్‌ : అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ చిప్‌ల తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ భారత్‌లో ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుమారు 1,000 మందిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని రిపోర్టులు వస్తోన్నాయి. గత రెండు మూడు వారాలుగా తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుండగా.. నవంబర్‌ 9 నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో మొదటి విడత చర్యలు చేపట్టినట్లు సమాచారం. సీనియర్‌ ఇంజినీర్లు, సంస్థలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న అనుభవజ్ఞులూ ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. తదుపరి దశలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, చెన్నై కేంద్రాలకూ ఈ కోతలు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో క్వాల్‌కామ్‌కు సుమారు 20 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 5–6 శాతం మందిపై కోతల ప్రభావం పడవచ్చని అంచనా. అయితే తొలగించనున్న ఉద్యోగాల సంఖ్యపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఉద్యోగాల కోతకు హ్యాండ్‌సెట్‌ చిప్‌ విభాగం ఆదాయంలో తగ్గుదల కారణమని సమాచారం. ప్రభావిత ఉద్యోగులకు మూడు నుంచి ఐదు నెలల వేతనంతో పాటు సర్వీసు కాలానికి అనుగుణంగా అదనపు పరిహారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో నిష్క్రమణ పత్రాలపై సంతకం చేస్తే మరో నెల వేతనం అదనంగా ఇస్తున్నట్లు ఆ వర్గాల సమాచారం. అక్టోబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రణాళికను క్వాల్‌కామ్‌ సిఇఒ క్రిస్టియానో ​​అమోన్‌ ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఈ చర్యలు చేపట్టింది.

​​ఉత్తర అమెరికాలో పెప్సీకో కోతలు..

​ప్రముఖ పానీయాలు, స్నాక్స్‌ తయారీ సంస్థ పెప్సీకో ఉత్తర అమెరికా విభాగంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించి, నిర్ణయాల వేగం పెంచడం, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్య చేపడుతున్నట్లు ఉత్తర అమెరికా సిఇఒ రామ్‌ కృష్ణన్‌ సోమవారం ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో తెలిపారు. ప్రస్తుతం సంస్థ కార్యకలాపాల నిర్మాణం సంక్లిష్టంగా, విభజితంగా ఉందని, మార్పులు వచ్చే వారంలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలో పానీయాల విక్రయాలు మందగించడం, స్నాక్స్‌ ధరల పెరుగుదలతో వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పెప్సీకోలో 3.06 లక్షల మంది, అమెరికాలో 1.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్