- త్వరలోనే జియో ఐపిఒ..!
- ముకేష్ అంబానీ వెల్లడి
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లో రోజువారీ నిర్వహణ బాధ్యతలను తన పిల్లలకు బదిలీ చేసే ప్రక్రియ దాదాపు పూర్తయిందని బిలియనీర్, ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోనే అత్యంత విలువైన ఈ గ్రూప్‌లో ఎంతో కాలంగా ఆసక్తికరంగా సాగుతున్న వారసత్వ బదిలీ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుందని ఆయన వెల్లడించారు. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో అంబానీ పలు వివరాలను వెల్లడించారు.
ఆకాశ్, ఈషా, అనంత్ అంబానీలు ఇప్పటికే గ్రూప్‌లోని కీలక వ్యాపార విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్, న్యూ ఎనర్జీ రంగాలలో రిలయన్స్ తదుపరి విడత వృద్ధిని వారే ముందుకు తీసుకెళ్తారని 69 ఏళ్ల ముకేష్ అంబానీ స్పష్టం చేశారు. కంపెనీ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లోనే కాకుండా.. మరింత ఉన్నత శిఖరాలకు చేరగల సమర్థుల చేతుల్లో ఉందని ఆయన వాటాదారులకు భరోసా ఇచ్చారు.
ముగ్గురు పిల్లలు.. మూడు కీలక విభాగాలు
34 ఏళ్ల ఈషా అంబానీకి రిటైల్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు.
34 ఏళ్ల ఆకాశ్ అంబానీ జియోతో కూడిన టెక్నాలజీ, డిజిటల్ వ్యాపారాలను చూస్తున్నారు. అలాగే రిలయన్స్ మీడియా వ్యాపార పర్యవేక్షణ కూడా చేస్తున్నారు.
31 ఏళ్ల అనంత్ అంబానీ సాంప్రదాయ ఆయిల్ నుంచి కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేషణ ఉత్పత్తితో పాటు కొత్తగా చేపట్టిన న్యూ ఎనర్జీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
‘‘వారు వేర్వేరు వ్యాపార విభాగాలను నడిపిస్తున్నప్పటికీ, రిలయన్స్ వ్యవస్థ సమగ్ర వృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తారు. వారు మూడు శరీరాలు, ఒకే ఆత్మ. ఆ ఆత్మ పేరు రిలయన్స్. అది ఎప్పటికీ విభజించలేనిది" అని ముకేష్ అంబానీ పేర్కొన్నారు.
500 మంది యువ బృందం
500 మంది యువ నాయకులతో కొత్త తరం
వ్యాపార నిర్వహణలో తన పిల్లలకు అండగా ఉండేందుకు 30, 40 ఏళ్ల వయస్సు గల సుమారు 500 మంది యువ నాయకులను వివిధ విభాగాలలో తీర్చిదిద్దినట్లు అంబానీ వెల్లడించారు. ఈ యువ బృందానికి సీనియర్ల మార్గదర్శకత్వం లభిస్తుందని, తద్వారా రిలయన్స్ సంస్కృతి, ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. ఎజిఎంలో ఆకాశ్ ప్రవేశపెట్టిన డిజిటల్ ప్రణాళికను, ఈషా సమర్పించిన రిటైల్ రోడ్‌మ్యాప్‌ను, అనంత్ వివరించిన ఎనర్జీ బిజినెస్ అప్‌డేట్‌లను ముకేష్ అంబానీ ప్రత్యేకంగా అభినందించారు.
స్పష్టమైన రోడ్‌మ్యాప్
2002లో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ఎలాంటి వీలునామా రాయకుండా మరణించడంతో ముకేష్ అంబానీ, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మధ్య గ్రూప్ నియంత్రణ కోసం సుదీర్ఘ వివాదం నడిచింది. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. దాదాపు 89 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ముకేష్ అంబానీ తన సామ్రాజ్య వారసత్వ బదిలీని అత్యంత క్రమబద్ధంగా, వివాద రహితంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
అయితే.. ముకేశ్ అంబానీ గ్రూప్ సిఎండి పదవి నుంచి ఎప్పుడు తప్పుకుంటారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. గతంలోనే ఆయన ఆగస్టు 2028 వరకు ఈ పదవిలో కొనసాగేలా ఆమోదం పొంది ఉన్నారు. ఆయన భార్య నీతా అంబానీ గ్రూప్‌నకు సంబంధించిన సామాజిక, సేవా కార్యక్రమాలను చూస్తున్నారు.
సెబీకి జియో డిఆర్‌హెచ్‌పి దాఖలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపిఒకు బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపిందని అంబానీ తెలిపారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి)ను శుక్రవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. జియో ఐపిఒ ప్రక్రియ ప్రారంభం కావడం తనకు, మొత్తం రిలయన్స్ కుటుంబానికి, సంస్థకు చెందిన మిలియన్ల కొద్దీ వాటాదారులకు అత్యంత భావోద్వేగ భరితమైన క్షణమని పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)