శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏటా 80 లక్షల ఉద్యోగాలు కావాలి

9 గంటల క్రితం

ఏటా 80 లక్షల ఉద్యోగాలు కావాలి
తయారీ ఎగుమతులు10 శాతం పెరగాలి..
ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 12:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తయారీ ఎగుమతులు10 శాతం పెరగాలి..

ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక


న్యూఢిల్లీ : దేశంలో వచ్చే పదేళ్ల పాటు ఏటా సుమారు 80 లక్షల అదనపు ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ఇందుకు తయారీ రంగాన్ని విస్తరించడం, ఎగుమతులను వేగంగా పెంచడం కీలకమని సూచించింది. ఇందుకోసం ముడిసరుకు, విడిభాగాల దిగుమతులపై అధిక సుంకాలను తగ్గించి, సరళమైన సుంకాల విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. దిగుమతి సుంకాలు తగ్గితే తయారీ సంస్థల ఉత్పత్తి వ్యయాలు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వం పెరుగుతుందని, తద్వారా ఉత్పత్తి విస్తరణ, ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది.

మహిళల ఉద్యోగ భాగస్వామ్యం పెరగడం, వ్యవసాయం నుంచి వ్యవసాయేతర రంగాలకు కార్మికులు మారడం, యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించడం వంటి పరిణామాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టి అవసరం పెరుగుతోందని నివేదిక తెలిపింది. మహిళా కార్మిక భాగస్వామ్యాన్ని 55 శాతానికి పెంచాలంటే ఏటా సుమారు 60 లక్షల ఉద్యోగాలు అవసరమవుతాయని అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో తయారీ ఎగుమతులు ఏటా 10 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం నమోదవుతున్న 5.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో భారత తయారీ రంగం మరింత భాగస్వామ్యం కావాలంటే దిగుమతి సుంకాల విధానాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. కేవలం దేశీయ ఉత్పత్తి పెంచడం కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడగలిగే ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఎగుమతులు, ఉపాధి అవకాశాలు విస్తరించవచ్చని పేర్కొంది. అయితే సుంకాల తగ్గింపు ఒక్కటే ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వదని, పెట్టుబడులు, నైపుణ్యాలు, మౌలిక వసతులు, మార్కెట్‌ డిమాండ్‌ వంటి అంశాలూ కీలకమని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్