న్యూఢిల్లీ : ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతోన్న వేళ .... సిఎన్జి ధరలు మళ్లీ పెరిగాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలో కూడా వరుసగా రెండో నెలలో పెంపు నమోదైంది. మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సిఎన్జి ధరను కేజీకి రూ.2 చొప్పున పెంచింది. దీంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88 కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. ఈ ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ధరలకు అనుగుణంగా ఈ ఇంధనాల రేట్లను సవరించినట్లు ఎంజిఎల్ వెల్లడించింది.
రెండురోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా సిఎన్జి ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ గ్యాస్ ధర రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. సిఎన్జి ధరలు పెరగడంతో ఆటో, ట్యాక్సీ సంఘాలు ప్రయాణ ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర లీటర్‌కు రూ.6.28 (5.46 శాతం) మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి పెరిగింది. ఈ మేరకు ఇండియన్ ఆయిలో కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుంది. దీంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. ఆగస్టు ఒకటిన ఏటీఎఫ్ లీటర్ ధర రూ.110 నుంచి 115కు పెరిగిన సంగతి తెలిసిందే. 19 కేజీల వాణిజ్య సిలిండర్ (LPG Gas Cylinder) ధర మరోసారి పెరిగింది. ఒక్క సిలిండర్‌పై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.9.50 నుంచి రూ.11.50 వరకు పెరిగింది.








కామెంట్‌లు (0)