గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీట్ పేపర్ లీక్ - సిజెపి ఉద్యమం - చలో పార్లమెంట్

1 గంట క్రితం

Chalo Parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

భారత విద్యా వ్యవస్థ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు, అవినీతి విద్యారంగంలో భారీగా పెరిగాయి. దీన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు, యువత ముందుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్నారు. మా భవిష్యత్తు ఏమిటని రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే 3వ తేదీన 22.05 లక్షల మంది విద్యార్థులు నీట్‌ రాశారు. కానీ పరీక్షకు 72 గంటల ముందే రాజస్థాన్ పోలీసులు ఒక కోచింగ్ సెంటర్‌పై దాడి చేసి ప్రశ్నాపత్రం సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పేపర్ రూ.8 లక్షల నుండి రూ.40 లక్షల వరకు అమ్ముడైనట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. దాంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 20 మందికి పైగా అరెస్టయ్యారు. రీటెస్ట్ తేదీ ప్రకటించారు. కానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 18 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 21 రీటెస్ట్‌కు 19.99 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. జులై 16న ఫలితాలు వచ్చాయి. కానీ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఎంబిబిఎస్‌ సీట్లు, కాలేజీలు అన్నీ లేటయ్యాయి. ఒక సంవత్సరం వృథా. ఈ నష్టానికి బాధ్యత ఎవరిది?

ఈ అన్యాయాన్ని చూసి చూసి సహించలేక విద్యార్థులు సంఘటితమయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ‌ నాయకులందరూ నీట్, జెఇఇ, సియుఇటి రాసిన విద్యార్థులే. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా జీవించలేక పోరు బాట పట్టారు. తమ భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నారు.

​ సిజెపి ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచే సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జులై 10న ప్రభుత్వం చర్చలకు నిరాకరించడంతో ఆయన జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ప్రధానిని, విద్యా మంత్రిని కలిసి డిమాండ్ల పత్రాన్ని ఇచ్చేందుకు సిజెపి "చలో పార్లమెంట్"కు పిలుపునిచ్చింది. విద్యార్థులు, యువతపై కనీసం జాలి, దయ, కరుణ లేని ప్రభుత్వం, పోలీసులు వారిపై దమనకాండను ప్రదర్శించారు. మొదట వాటర్ క్యానన్లు ప్రయోగించారు. తర్వాత లాఠీచార్జ్. పారిపోతున్న విద్యార్థులను వెంబడించి మరీ కొట్టారు. అరెస్టులు చేశారు. 24 గంటల పాటు న్యాయవాదిని కూడా కలవనివ్వలేదు.

ఇప్పుడు చట్టపరంగా చూద్దాం. భారత రాజ్యాంగ ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తుంది. ఆర్టికల్ 19(1)(b) శాంతియుతంగా గుమిగూడే హక్కు ఇస్తుంది. విద్యార్థులు ఈ రెండు హక్కులను ఉపయోగించారు. పోలీసు చట్టం 1861 సెక్షన్ 129 ప్రకారం గుంపును చెదరగొట్టే ముందు మూడు సార్లు హెచ్చరించాలి. అది చేయలేదు. సిఆర్‌‌పిసి సెక్షన్ 151 ప్రకారం ముందస్తు అరెస్టుకు కారణం ఉండాలి. కేవలం నిరసన చేస్తారనే అనుమానంతో అరెస్టు చేయడం చట్టవిరుద్ధం. మానవ హక్కుల చట్టం 1993 ప్రకారం నిర్బంధంలో హింస నేరం. వీడియోల్లో కనిపించిన లాఠీ దెబ్బలు ఈ నేరం కిందకు వస్తాయి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాపాడాలి. బదులుగా దానిని నాశనం చేసిన వారిని కాపాడుతోంది. సుప్రీం కోర్టు అనేక తీర్పుల్లో "శాంతియుత నిరసనను అణచివేయడం రాజ్యాంగ ఉల్లంఘన" అని స్పష్టం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం, నైతికంగా తప్పు.

​ఈ పేపర్ లీక్ కేవలం ఒక అధికారి తప్పు కాదు. దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉంది. మొదటి లింక్ కోచింగ్ సెంటర్లు. రూ.62 వేల కోట్ల ఇండస్ట్రీ. ఒక సీటు కోసం లక్ష నుండి రూ.6 లక్షల వరకు ఫీజు. రెండవ లింక్ ఎన్‌‌టిఎ లోని అవినీతి అధికారులు. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుండి పరీక్షా కేంద్రానికి వెళ్లే లోపు అనేక చేతులు మారుతుంది. మూడవ లింక్ రాజకీయ అండ. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు, స్థానిక నాయకులు ఈ దందాకు సహకరిస్తున్నారు. నాల్గవ లింక్ డార్క్ వెబ్, టెలిగ్రామ్ గ్రూపులు. ఇక్కడ పేపర్ వేలంలో అమ్ముతారు. పేద విద్యార్థి కోచింగ్ ఫీజు కట్టలేడు. ధనిక విద్యార్థి రూ.30-40 లక్షలు పెట్టి లీకైన పేపర్ కొంటాడు. ఫలితంగా అర్హత ఉన్న పేద విద్యార్థి వెనుకబడిపోతాడు. ‌డబ్బుంటే అనర్హుడైనా ఎంబిబిఎస్‌ సీటు కొడతాడు. ఇది రాజ్యాంగ ఆర్టికల్ 14 - సమానత్వ హక్కు, ఆర్టికల్ 21ఎ - విద్యా హక్కు ఉల్లంఘన. విద్యను వ్యాపారంగా మార్చినంత కాలం ఈ లీకేజీలు ఆగవు.

​ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో మూడు తప్పులు చేసింది. మొదటిది ముందస్తు చర్య లేదు. ఎన్‌‌టిఎ పై వస్తున్న ఆరోపణలను సంవత్సరాలుగా పట్టించుకోలేదు. రెండవది ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత పారదర్శకత లేదు. సిబిఐ దర్యాప్తు వివరాలు బయటకు చెప్పడం లేదు. మూడవది నిరసన చేసిన వారిని నేరస్తుల్లా చూడటం. ప్రధాని మోడీ గత 10 రోజులుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ "ఇది చిన్న సమస్య" అన్నారు. కేంద్ర మంత్రులు "విద్యార్థులను రాజకీయాలకు వాడుతున్నారు" అనే అభాండాలు వేశారు. కానీ రాజకీయాలకు విద్యార్థుల భవిష్యత్తును వాడుతున్నారు. ప్రభుత్వం చివరికి జులై 15న చర్చలకు పిలిచింది. కానీ అది కూడా షరతులతో కూడుకున్నది. "దీక్ష విరమించిన తర్వాతే చర్చలు" అన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పుడే చర్చలు జరగాలి. ప్రాణం పోయిన తర్వాత చర్చలు దేనికి? ఈ మొండి వైఖరి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అవమానం.

మొదట ఎన్‌‌టిఎ ను వెంటనే రద్దు చేయాలి. దాని స్థానంలో విద్యావేత్తలు, న్యాయమూర్తులు, విద్యార్థి ప్రతినిధులు ఉండే స్వతంత్ర కమిషన్‌ ఏర్పాటు చేయాలి. పరీక్షలను ఆఫ్‌లైన్ నుండి ఆన్‌లైన్ ‌సిబిటి మోడ్‌కు మార్చాలి. ప్రశ్నలు రాండమ్‌గా జనరేట్ అయ్యేలా చేయాలి. పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కఠిన చట్టం తేవాలి. నిందితుల ఆస్తులు జప్తు చేయాలి. 2026 నీట్‌ వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి 2 లక్షల నష్టపరిహారం, ఒక సంవత్సరం ఉచిత కోచింగ్ ఇవ్వాలి. విద్యా బడ్జెట్‌ను ‌జిడిపి లో 6 శాతానికి పెంచాలి. నిరుద్యోగానికి పరిష్కారంగా ప్రతి సంవత్సరం రూ.2 కోట్ల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించాలి. కోచింగ్ సెంటర్లను రెగ్యులేట్ చేయాలి. ఫీజు క్యాప్ పెట్టాలి. చనిపోయిన నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అవినీతి, పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఉద్యమం చేస్తున్న విద్యార్థుల పైన, మద్దతుదారుల పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలి. వారికి మద్దతు ఇస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్ చుక్ బృందంతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలి. ఆయన్ని బేషరతుగా విడుదల చేయాలి.


వ్యాసకర్త : నంబూరి శ్రీమన్నారాయణ
సుప్రీంకోర్టు న్యాయవాది, పౌర హక్కుల నేత,

సెల్‌: బైల్: 9493861875 /

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్