ఒక పెద్ద అడవిలో ఓ జింక ఉండేది. అది చాలా అమాయకం, మంచితనం కలిగినది. అడవిలోని ప్రతి జంతువునూ తన స్నేహితులుగానే భావించేది. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేసేది. అదే అడవిలో ఒక నక్క ఉండేది. అది బయటకు చాలా వినయంగా, ప్రేమగా మాట్లాడేది. కానీ మనసులో మాత్రం స్వార్థం, కపటం నింపుకుని ఉండేది. జింక మంచితనాన్ని చూసి, దానిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఒక రోజు నక్క జింక దగ్గరకు వచ్చి, ‘మిత్రమా! అడవికి ఆవల ఒక పచ్చిక మైదానం ఉంది. అక్కడ ఎన్నో రుచికరమైన గడ్డి మొక్కలు ఉన్నాయి. మనిద్దరం కలిసి వెళ్దాం’ అని చెప్పింది. జింక నక్క మాటలను నమ్మింది. ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. కానీ నక్కకు వేరే ఆలోచన ఉంది. దారిలో ఒక వేటగాడు వేసిన ఉచ్చును చూసి, జింకను ఆ దారిలో నడిపించింది. అమాయకమైన జింక ఉచ్చులో చిక్కుకుంది. నక్క మాత్రం దూరంగా నిలబడి, ‘నీ అమాయకత్వమే నీ ఓటమి!’ అని నవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఉచ్చులో చిక్కుకున్న జింక చాలా బాధపడింది. తన నమ్మకమే తనను మోసం చేసిందని కన్నీరు పెట్టుకుంది. కానీ అప్పుడే దగ్గరలో ఉన్న ఒక ఏనుగు జింక దగ్గరకు వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది. జింక జరిగిన విషయం చెప్పింది. ఏనుగు చిరునవ్వుతో, ‘నిన్ను మోసం చేసింది నీ మంచితనం కాదు. నక్క కపట నాటకం. నువ్వు ఓడిపోయింది నమ్మకంలో మాత్రమే, నీ వ్యక్తిత్వంలో కాదు. గాయం నీ శరీరానికి మాత్రమే, నీ ధైర్యానికి కాదు’ అని చెప్పింది. ఆ మాటలు జింకకు కొత్త శక్తిని ఇచ్చాయి. కొంతసేపటి తర్వాత ఏనుగు సహాయంతో జింక ఉచ్చు నుంచి బయటపడింది. గాయాలు మానడానికి రోజులు పట్టాయి. కానీ దాని ఆత్మవిశ్వాసం మాత్రం మరింత బలపడింది.
కొన్ని నెలల తర్వాత అడవిలో కరువు వచ్చింది. అన్ని జంతువులు ఇబ్బందులు పడుతున్నాయి. అప్పుడే జింకకు ఒక రహస్యమైన నీటి చెరువు గుర్తొచ్చింది. తనను మోసం చేసిన నక్కను కూడా ద్వేషించకుండా, అన్ని జంతువులను ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లింది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ జింకను గౌరవించాయి. నక్క మాత్రం తలదించుకుంది. అప్పుడు ఏనుగు ఇలా చెప్పింది. ‘మోసం చేసినవాడు ఒకసారి గెలిచినట్లు కనిపించవచ్చు. కానీ నిజాయితీగా నిలిచినవాడు జీవితాంతం గెలుస్తాడు. నమ్మకాన్ని ద్రోహం చేయడం సంస్కారం కాదు. ద్రోహం ఎదురైనా మంచితనాన్ని వదలకపోవడమే గొప్ప వ్యక్తిత్వం’ అని చెప్పింది. ఆ రోజు నుంచి జింక అడవిలో గౌరవానికి ప్రతీకగా నిలిచింది. నక్క మాత్రం అందరి నమ్మకాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.
- డా. పూసపాటి వేదాద్రి,
99121 97694.







కామెంట్‌లు (0)