అధిక వడ్డీ, ఇంధన ధరలతో ఆర్థిక ఒత్తిళ్లు..
మూడీస్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రుణ సవాళ్లు నెలకొని ఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. రుణాలపై వడ్డీ వ్యయాలు పెరగడం, ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగడం వల్ల 2027లో కంపెనీలు, రుణగ్రహీతలపై ఆర్థిక ఒత్తిడి పెరగనుందని హెచ్చరించింది. పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వృద్ధిని కొనసాగించినప్పటికీ.. అధిక రుణభారం ఉన్న సంస్థలకు పరిస్థితులు సవాలుగా మారనున్నాయని మూడీస్ రేటింగ్స్ తన 2027 గ్లోబల్ క్రెడిట్ కండిషన్స్ ఔట్లుక్ నివేదికలో హెచ్చరించింది. కృత్రిమ మేధ (ఎఐ) రంగంలో పెట్టుబడులు భారీ స్థాయిలో కొనసాగనున్నాయని తెలిపింది. అయితే ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఆదాయాలు, ఉత్పాదకత పెరుగుతున్నాయా లేదా అన్న అంశంపై మదుపర్లు మరింత దృష్టి సారిస్తారని వివరించింది. ఎఐ కారణంగా కొన్ని సంస్థలకు డిమాండ్, ఉత్పాదకత పెరిగే అవకాశముండగా, మరికొన్ని కంపెనీలు తీవ్ర పోటీని, ధరల నిర్ణయాధికారంలో తగ్గుదలను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. దిగుమతి సుంకాలు, నియంత్రణలు, ఎగుమతులపై ఆంక్షలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ప్రభుత్వాలు మార్కెట్లను ప్రభావితం చేసే ధోరణి పెరుగుతుందని తెలిపింది. ఈ విధానాలతో వాణిజ్యం, పెట్టుబడుల కేటాయింపు, పోటీపై అనిశ్చితి కొనసాగుతుందని వివరించింది. ముఖ్యంగా అధిక అప్పులు కలిగిన సంస్థలు, సమీప కాలంలో పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించాల్సిన కంపెనీలపై రీఫైనాన్సింగ్ వ్యయాల పెరుగుదల తీవ్ర ఒత్తిడికి గురి చేయనుందని అంచనా వేసింది.







కామెంట్లు (0)