గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమార్కెట్లను వీడని నష్టాలు..

1 గంట క్రితం

sensex
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు ఆవిరి

  • సెన్సెక్స్‌ 460 పాయింట్లు పతనం

ముంబయి : ​దేశీయ స్టాక్‌ మార్కెట్లను వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో గురువారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 460 పాయింట్లకు పైగా పతనమై 73,249 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 22,688 వద్ద ముగిసింది. ఈ పతనంతో ఒక్కరోజే మదుపర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. బిఎస్‌ఇలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.458 లక్షల కోట్లకు దిగజారింది. ప్రధాన సూచీల కంటే చిన్న, మధ్యతరహా కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. వరుసగా మూడు రోజుల నష్టాలతో దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. నిఫ్టీ 22,590 స్థాయిని నిలబెట్టుకోలేకపోతే మరింత పతనానికి అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడవచ్చన్న భయాలు మార్కెట్లను కుదిపేశాయి. సౌదీ అరామ్‌కో చమురు క్షేత్రంపై డ్రోన్‌ దాడి నేపథ్యంలో బ్రెంట్‌ ముడిచమురు ధర దాదాపు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 110.7 డాలర్లకు చేరింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత్‌కు ఈ పరిణామం ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయం, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. మరోవైపు చైనా మార్కెట్లు గరిష్ఠ స్థాయిల నుంచి 20 శాతానికి పైగా పతనం కాగా, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ సూచీలు దాదాపు 3 శాతం చొప్పున నష్టపోయాయి. జపాన్‌ మార్కెట్‌ 2 శాతానికి పైగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్