గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేవరగట్టులో ‘బన్నీ’ ఉత్సవం రక్తసిక్తం

23 నిమిషాల క్రితం

దేవరగట్టులో ‘బన్నీ’ ఉత్సవం రక్తసిక్తం image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దేవరగట్టులో తొక్కిసలాటలో ఒకరి మృతి

  • రింగ్‌ ‌కర్రలతో కొట్టుకోవడంతో 80 మందికి గాయాలు

  • వారిలో ఐదుగురి పరిస్థితి విషమం

ప్రజాశక్తి- హొళగుంద : కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా నిర్వహించే ప్రసిద్ధిగాంచిన మాళ మల్లేశ్వరస్వామి ‘బన్నీ’ (కర్రల సమరం) ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ఆలూరుకు చెందిన పోతురాజు (29) అనే యువకుడు మృతి చెందాడు. రింగ్‌ ‌కర్రలతో కొట్టుకోవడంతో దాదాపు 80 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో కొండపై వేదపండితులు రవిశర్మ ఆధ్వర్యంలో మాళ మల్లేశ్వరస్వాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో కొండపై నుంచి కిందకు తీసుకొచ్చి సింహాసనం కట్ట వద్దకు చేర్చారు. అక్కడ మహా మంగళహారతి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఒకవైపు నెరనికి, కొత్తపేట, నెరనికి తండా గ్రామాల ప్రజలు, మరోవైపు ఆలూరు, అరికెర, సులువాయి, బిలేహాల్, వీరుపాపురం గ్రామాల ప్రజలు రింగ్ కర్రలతో తలపడ్డారు. సుమారు గంటసేపు ఇరుగ్రూపులు కర్రలు, రాళ్లు, అగ్గిదివిటీలతో పోలీసుల సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా జనాలు తరలిరావడంతో ఏమీ చేయలేక ఒక దశలో చేతులెత్తేశారు. అనంతరం అదనపు పోలీస్ బెటాలియన్ రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసి ఇరుగ్రూపులను చెదరగొట్టారు. కర్రల సమరంలో గాయపడిన వారికి కొండ దిగువన ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం ఆలూరు, ఆదోని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. గురువారం తెల్లవారుజామున ఎదురు బసవన్న గుడికి చేరుకున్న అనంతరం పూజారి గోరువయ్య చెప్పిన ‘భవిష్యవాణి’తో తొలిరోజు బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈ వేడుకలను తిలకించేందుకు మన రాష్ట్రంతో పాటు పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది వచ్చారు.

దేవరగట్టులో ‘బన్నీ’ ఉత్సవం రక్తసిక్తం image 1

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్