క్రికెట్ చరిత్రలో సంచలన విజయం!
బ్రూక్ రికార్డు డబుల్ సెంచరీ వృథా..
రత్నాయకే శతకం, శనక–ఫెర్నాండో మెరుపు ఇన్నింగ్స్‌తో లంక జట్టు చారిత్రక గెలుపు
ఇంగ్లాండ్ భారీ స్కోరు.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ రికార్డు డబుల్ సెంచరీ.. అయినా విజయం మాత్రం శ్రీలంకనే వరించింది. ఏకంగా 429 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక జట్టు క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి చారిత్రక విజయాన్ని అందుకున్నారు.
బ్రూక్ విధ్వంసం.. ఇంగ్లాండ్ భారీ స్కోరు
ఈ మ్యాచ్‌లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 114 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి అద్భుతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో వేగవంతమైన ద్విశతక రికార్డును సృష్టించాడు. మరోవైపు జో రూట్ 69 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరును అందుకుంది. ఈ లక్ష్యంతో ప్రత్యర్థి జట్టు గెలవడం దాదాపు అసాధ్యమేనని అంతా భావించారు.
లంక బ్యాటర్ల ఎదురుదాడి
430 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు సవాల్ విసిరింది. పవన్ రత్నాయకే అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు. 106 బంతుల్లో 130 పరుగులు చేసి కీలకమైన శతకాన్ని నమోదు చేశాడు.
అవిష్క ఫెర్నాండో, దసున్ శనక కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ చెరో 97 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వచ్చినప్పటికీ, తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయారు. చివరి దశలో జనిత్ లియానాగే కేవలం 27 బంతుల్లో 61 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లంక వైపు తిప్పాడు. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. లక్ష్యం చేరువలో ఉండటంతో ఇరు జట్ల అభిమానుల్లోనూ ఆందోళన కనిపించింది. అయితే ఒత్తిడిని అధిగమించిన శ్రీలంక బ్యాటర్లు చివరి వరకు పోరాడి లక్ష్యాన్ని అందుకున్నారు. 49.5 ఓవర్లలో 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేశారు.







కామెంట్‌లు (0)