ఆరో రోజూ మార్కెట్లకు లాభాలు
ముంబయి : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 10 శాతానికి పైగా తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగలడం, దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో గురువారం సెన్సెక్స్ 2,008.61 పాయింట్లు లేదా 2.60 శాతం దూసుకెళ్లి 79,310 వద్ద ముగిసింది. నిఫ్టీ 576 పాయింట్లు లేదా 2.40 శాతం లాభపడి 24,537కు చేరింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,160 పాయింట్లు, నిఫ్టీ 619 పాయింట్ల మేర ఎగిశాయి. దీంతో వరుసగా ఆరో సెషన్‌లోనూ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. బిఎస్‌ఇలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.6.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.501.4 లక్షల కోట్లకు చేరింది. ఆటో రంగ సూచీ 4 శాతానికి పైగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.9 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.3 శాతం లాభపడ్డాయి.
ఈ ర్యాలీకి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 10 శాతానికి పైగా పతనమై బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరడం దోహదపడింది. మరోవైపు ఈ వారం తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా రావడంతో ఇకపై ట్రంప్ తన దూకుడును తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయని బ్రోకర్లు పేర్కొంటున్నారు.







కామెంట్‌లు (0)