పిచ్చుకలు జంటగాను
చెట్టు మీద గూడు కట్టె
మెరుపు ఉన్న రంగులతో
ఆ గూడు అదిరిపోయె!
ముచ్చటైన గూడు చూసి
మెచ్చుకొనెను పక్షులన్ని
పిచ్చుక జత అభిరుచికి
పలుమార్లు పొగిడినవవి!
రోజులేమో గడిచినాయి
గుడ్లు పెట్టె పిచ్చుకమ్మ
సంతసముగ ఉంటూనే
గూడు నందు పొదిగెనదది!
ముద్దుగున్న పిల్లలగని
మురిపెంగా పెంచసాగె
వాటి కొరకు ఆహారం
గూటి నందు దాచి పెట్టె!
ఒక రోజున చిన్న పిట్ట
మూలుగుతూ బాధపడె
అది చూసిన తల్లి అంత
లాలించగ ప్రయత్నించె!
పిల్ల ఏడుపు ఆగలేదు
కారణమే తెలియరాదు
అనుమానం పెనుభూతం
తల్లి మనసు నావహించె!
ఇంతలోన మగపిచ్చుక
గూడు చెంత వచ్చి చేరె
తల్లి పిట్ట పెడబొబ్బలు
కంటి ముందు కానవచ్చె!
ఏమి జరిగెనేమోనని
భయపడిన మగ పిచ్చుక
ఓదార్పుగ పలకరించి
తల్లి పిట్ట నడిగెనంత!
'మంచి గూడు కట్టామని
పక్షులన్ని దిష్టి పెట్టె
ఆ దెబ్బతో మన పిల్లకు
జబ్బు చేసె ఈ క్షణమున!
దిష్టి పోవు ఉపాయమ్ము
ఆలోచన చేయుమింక'
బితుకు బితుకు మంటూనే
బదులు పలికె తల్లి పిట్ట!
మూఢనమ్మకం నీదంటు
కొట్టి వేసె మగ పిచ్చుక
వైద్యుడైన చిలకమ్మను
పిలుచుటకై వెడలెనంత!
చిలకమ్మ ఎగురుకుంటూ
పిచ్చుకమ్మ గూడు చేరె
పిల్ల కడుపు తడిమి చూచి
ఆలోచన చేయసాగె!
'గూడు తెచ్చె తంటా ఇది
పిల్ల జబ్బు కారణమిది
గూడు మార్చి చూడుమింక'
బదులు పలికె చిలకమ్మ!
'అనుమానం నిజమైనది
పెనుభూతం దిష్టియైనది
రుజువు చూపె చిలకమ్మ'
అరిచి చెప్పె తల్లి పక్షి!
'రంగు రంగు ముచ్చీలను
వాడినారు గూడు కొరకు
అలంకరణ ఆర్భాటం
కొంపముంచె ఈ దినం!
పోలీథీను వాడుకలో
పొంచి ఉండె ప్రమాదం
అందు తిన్న తిండి వలన
పిల్ల నలత నిజం నిజం!
దిష్టన్నది లేనేలేదు
శాస్త్రీయత నమ్మి చూడు
ఆరోగ్యం కుదుటపడును'
సూచించెను చిలకమ్మ!
సహజ గూడు అల్లినాయి
అందులోకి వెళ్ళినాయి
కుదుటపడె ఆరోగ్యం
కలసి వచ్చె సౌభాగ్యం!
– బి.వి. పట్నాయక్
83098 72913








కామెంట్‌లు (0)