సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజారోగ్యం ప్రభుత్వ శాఖల ఉమ్మడి బాధ్యత అని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జి వీరపాండియన్ తెలిపారు. మలేరియా, డెంగీ, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమని చెప్పారు. వర్షాకాల వ్యాధుల నివారణ, నియంత్రణపై వైద్యారోగ్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పురపాలక, విద్య, సంక్షేమ, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో బుధవారం ‘వర్చువల్’గా నిర్వహించిన ప్రభుత్వ భాగస్వామ్య శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టళ్లు, పాఠశాలలు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. హాస్టల్‌లో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన తర్వాతే సమాచారం ఇవ్వాలనే ధోరణి ఉండకూడదని, ఒక్క విద్యార్థి అస్వస్థతకు గురైనా వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు.
తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నీటి నమూనాల సేకరణ పరీక్షలు నిరంతరం చేయాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఆహారమే అందించాలన్నారు. వీధికుక్కల నియంత్రణ, రేబిస్ నివారణకు పశుసంవర్ధక, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలిసి కార్యాచరణ రూపొందించాలని వీరపాండియన్ ఆదేశించారు. పాముకాటు బాధితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే సకాలంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు.








కామెంట్‌లు (0)