డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల భద్రతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. అదే దృక్పథంతో మానవ, ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని పవన్ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పలమనేరు ప్రాంతంలో చేపట్టిన క్లిష్టమైన ఆపరేషన్లలో కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యుతో పాటు అటవీశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పని చేశారని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజల మరణాలను 70 శాతానికి పైగా తగ్గించడంతోపాటు, పంట నష్టాలను కూడా గణనీయంగా తగ్గించగలిగారని పేర్కొన్నారు. అదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. కుంకీ ఏనుగులను రాష్ట్రానికి పంపించిన కర్ణాటక ప్రభుత్వం, అక్కడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, అటవీ పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పిసిసిఎఫ్ పివి చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)