బైరవాపురం ఊరిలో రైతు రంగన్న దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఊరి మొత్తం మీద ఎక్కువగా పాలిచ్చే ఆవు అదే. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గ్రామాధికారి అనుకునేవాడు. దాన్ని అమ్మమని రంగన్నను అడిగేవాడు. అయితే రంగన్నకు ఆవును అమ్మడం ఇష్టం ఉండక మాట దాటవేసేవాడు. కొన్ని రోజులకు రంగన్న కుమార్తెకు పెళ్లి కుదరడంతో ఖర్చుల కోసం ఆవును అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో అడుగుతున్న గ్రామాధికారికి అమ్మితే సరైన ధర ఇవ్వడని, అతన్ని కాదని ఊరిలో మరొకరికి అమ్మడం సాధ్యపడదని, ఒక తెల్లవారుజామున పక్కనే ఉన్న పట్టణంలోని సంతకు రంగన్న ఆవును తోలుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న రామస్వామి కొడుకు బసవ ఎంత ధరకైనా ఆ ఆవును సొంతం చేసుకొని తండ్రిని సంతోషపెట్టాలనుకున్నాడు. అదే రోజు సాయంత్రం సంతలో కట్టేసి ఉన్న ఆ ఆవు తాడు తెంచుకొని, బైరవాపురం శివారులలో ఉన్న చేనులో మేయసాగింది. అది గమనించిన ఆ చేను యజమాని ఆవును గ్రామాధికారి వద్దకు తోలుకెళ్లాడు. విషయం చెబుతూ నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. ఆ ఆవు రంగన్నదని గ్రహించిన గ్రామాధికారి ఎక్కువ జరిమానా విధించి తక్కువ గడువు ఇస్తే... రంగన్న ఆ ఆవును కచ్చితంగా తనకే అమ్ముతాడని పథకం వేశాడు. ఆవు పంటలో చాలావరకూ నాశనం చేసింది కాబట్టి ఈ ప్రకారం.. దాని యజమాని రెండు రోజుల్లో పది వేల రూపాయలు జరిమానా కట్టాల్సిందే అని ఆదేశించాడు.
అంతలో హడావిడిగా పరుగెత్తుకుంటూ వచ్చిన బసవ- ‘హమ్మయ్యా.. ఆవు ఇక్కడ ఉందా? దీని కోసం ఊరంతా వెతుకులాడుతున్నా’ అని అన్నాడు. గ్రామాధికారి ఆశ్చర్యపోతూ.. ‘ఈ ఆవు గురించి ఊరంతా తిరగాల్సిన అవసరం నీకెందుకు పట్టింది’ అని కొడుకును అడిగాడు. ‘మీరు ఈ ఆవు మీద ఆశపడ్డారని తెలిసి పట్టణం సంతలో రంగన్న వద్ద ఈ ఆవును కొన్నాను నాన్నా. అక్కడ కట్టేసిన తాడు తెంపుకొని అలవాటు ప్రకారం ఇది మన ఊరికే వచ్చింది’ అని బదులిచ్చాడు బసవ. ఆ సమాధానం విన్న గ్రామాధికారి ముఖం తెల్లబోయింది. ఊరి పెద్దల ముందు ఇచ్చిన తీర్పు కావడంతో మరో మార్గం లేక, తనే జరిమానా చెల్లించి ఆవును సొంతం చేసుకున్నాడు.
- గుడ్ల వర్షిణి, 7వ తరగతి,
ఎపి మోడల్ స్కూలు,
పెరుమాళి, విజయనగరం జిల్లా.







కామెంట్‌లు (0)