ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాత ఆల్బమ్‌ ‌తిరగేస్తూ...

7 గంటల క్రితం

alaparthy geyam-20-9-26.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 07:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బీరువాలొ పుస్తకాలు

వెతుకుతున్న సమయంలో

చిన్నపాత ఆల్బమొకటి

చేతికి తగిలింది నాకు!!


చూస్తే ఆ ఆల్బమెపుడు

చూసినట్టుగానె లేదు!

నాన్నకు సంబంధించిన

చిన్ననాటి ఫోటోలవి!!


ఆ ఆల్బమ్‌ ‌తీసుకెళ్లి

అప్పగించితిని నాన్నకు!

వెయ్యి ఓల్టుల బల్బులా

వెలిగిందీ నాన్న ముఖం!!


ఒక్కొక్కటి వివరిస్తూ నాకు

ఉత్సాహం పొందె నాన్న!

బ్లాక్‌ అండ్‌ ‌వైట్‌ ‌వైనగాని

బాగానే వున్నా యవి!!


పుట్టినరోజున తలంటు

పోసుకొనీ కొత్తబట్ట

లేసుకొన్న శుభవేళా

తీసిన ఫోటోరా ఇది!!


అల్లరి చేస్తున్నానని

అమ్మ నన్ను కొడుతుంటే

చాటున నిలచీ నాన్నే

ఫోటో తీశాడుర ఇది!!


తలదువ్వుకోలేదనీ

తన్నెను మా నాన్న నన్ను!

అందుకనే నా ముఖమూ

అలా వుంది ఏడుస్తూ!!


ఎక్స్‌‌కర్షన్‌ ‌కనివెళ్లీ

ఏటిలోన ఈతలేస్తు

ఊసుకొంటు తోసుకొంటు

తీసుకున్న ఫోటో ఇది!!


గ్రూఫ్‌ ‌ఫోటో టెన్తులోది

గుర్తుగ నా తలచుట్టూ

గుండ్రంగా గీతగీస్తి

కుర్రాడినిగా అప్పుడు!!


ఆల్బమ్‌ ‌తిరగేస్తూ మహ

దానందం పొందె నాన్న!

ఆ పాత జ్ఞాపకాలూ

ఆ పాత మధురాలేను!!

‘‘బాలబంధు’’ అలపర్తి వెంకట సుబ్బారావు

(బాలసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

9440805001

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్