రండి రండి బాలలు
అందమైన వనానికి
రంగురంగు పువ్వులున్న
సువాసనల స్థలానికి
ముందు వరుసలో ఉన్నవి
ముద్దబంతి పువ్వులు
పసుపు, ఎరుపు రంగులు
కనుల కెంతో ఇంపులు
వాటి పక్క ఒద్దికగా
ఒదిగున్నవి మల్లెలు
తెల్లనైన వర్ణంతో
మెరుస్తున్న సుమాలు
కొద్దిగా పక్కకెళితే
కొమ్మకొమ్మనా విరిసి
గుప్పుమనే సుగంధాలు
వెదజల్లే సంపెంగలు
ఆ పక్కన సరస్సులో
విరబూసిన తామరలు
వాటి పక్క తేలియాడే
ఆకుపచ్చ ఆకులు
తలలను పైకెత్తి చూసు
శ్వేత వర్ణ లిల్లీలు
గుత్తుగుత్తులగ పూసి
మత్తుజల్లు మొగ్గలు
భూమికి జానెడు ఎత్తున
చిరునవ్వుల చామంతులు
రకరకాల రంగులతో
మొక్కనిండా కుసుమాలు
పువ్వులపై వాలేనులే
తుమ్మెదల గుంపులు
వాటితో మాటలాడి
తేనెనిచ్చు ఆ విరులు
తోటలో ఎగురుతున్న
చిట్టి తేనె పిట్టలు
పూల రంగుతో కలిసిన
సీతాకోక చిలుకలు
పూలతోట అంటేనే
ఆహ్లాదపు చిరునామా
ఆ అందాలను చూడగా
మనసు సేద తీరు సుమా!
ఏమాశించక మొక్కలు
ఇచ్చేనులే పువ్వులు
కొద్ది నీరు పోసి శ్రద్ధ
చూపాలోయ్ బాలలు!
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.








కామెంట్‌లు (0)