మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశాంతంగా ముగిసిన వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నిక

18 నిమిషాల క్రితం

Vice Chairperson election concludes peacefully
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏకగ్రీవంగా ఎన్నికయినా గొర్లె శివన్నారాయణ మూర్తి


ప్రజాశక్తి-యలమంచిలి టౌన్ (అనకాపల్లి) : యలమంచిలి మున్సిపాలిటీ నూతన వైస్ చైర్‌పర్సన్‌గా 30వ వార్డు సభ్యుడు గొర్లె శివన్నారాయణ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డిఓ ) కె.వి. రామలక్ష్మి పర్యవేక్షణలో మంగళవారం ఈ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నేడు హాజరైన మిగిలిన వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ పిల్లా రామకుమారి, టిడిపి, బిజెపి కౌన్సిలర్లు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉదయం 11 గంటలకు కోరం సరిపోవడంతో వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. వైస్ చైర్‌పర్సన్ పదవికి గొర్లె శివన్నారాయణ మూర్తి పేరును 13వ వార్డు సభ్యురాలు సీర సాయి ప్రసన్న (బిజెపి) ప్రతిపాదించగా, 21వ వార్డు సభ్యుడు కొత్తలంక రాజేష్ (టిడిపి) బలపరిచారు. మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గొర్లె శివన్నారాయణ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి సభ్యులు మాత్రమే పాల్గొనగా, వైసిపి సభ్యులు గైర్హాజరయ్యారు. కాగా, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ముగిసిన అనంతరం వైసిపి కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌కు వచ్చి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నిక ఫలితాల నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్