దోహా : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఎ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. యూఏఈతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో అర్షద్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో భారత్-ఎ విజయానికి 250 పరుగులు చేయాల్సి ఉంది.
యూఏఈ బ్యాటర్లలో హర్‌ప్రీత్ సింగ్ భాటియా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నారు. 144 బంతులు ఎదుర్కొన్న అతను 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 130 పరుగులు చేశారు. బాసిల్ హమీద్ 36 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మహమ్మద్ షాహద్ 28, ఇథాన్ డీసౌజా 25 పరుగులు చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ కి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆర్యాన్ష్ శర్మ (2) వికెట్ కోల్పోయింది. అనంతరం అర్షద్ ఖాన్ అన్ష్ టాండన్ (8) ను పెవిలియన్‌కు పంపారు. ఈ దశలో హర్‌ప్రీత్ సింగ్, మహమ్మద్ షాహద్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని హర్ష్ దూబే విడదీసి షాహద్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపారు.
ఆ తర్వాత ఇథాన్ డీసౌజాతో కలిసి హర్‌ప్రీత్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. డీసౌజా (25), అప్తబ్ అలామ్ (2) వికెట్లు కోల్పోయినా హర్‌ప్రీత్ తన దూకుడు కొనసాగించారు. బాసిల్ హమీద్‌తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించి జట్టును మెరుగైన స్థితికి చేర్చారు. ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న హర్‌ప్రీత్.. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యారు. అనంతరం ఇబ్రార్ అహ్మద్ (0), జాహిద్ అలీ (7) త్వరగా వెనుదిరిగినా బాసిల్ హమీద్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 249కి చేర్చారు. భారత్-ఎ బౌలర్లలో అర్షద్ ఖాన్ 43 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్, సూర్యాన్ష్ షెడ్గే ఒక్కో వికెట్ తీశారు.







కామెంట్‌లు (0)