మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై అవగాహన కల్పించిన జిఎంసి వైద్యులు

16 నిమిషాల క్రితం

GMC doctors raise awareness about antimicrobial resistance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • యాంటీబయాటిక్స్‌ను బాధ్యతగా వాడాలి


ప్రజాశక్తి - అనంతపురం : యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన మేరకే వినియోగించాలని, సొంత వైద్యంతో మందులు వాడటం ప్రమాదకరమని ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు సూచించారు. ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్‌ను పురస్కరించుకుని నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి), ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్), మైక్రోబయాలజీ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు 1, 2 సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీబయాటిక్స్‌ను వైద్యులు సూచించిన మోతాదులో, నిర్ణీత కాలం పాటు మాత్రమే వినియోగించాలని అవగాహన కల్పించారు. చికిత్స మధ్యలో మందులు ఆపకూడదని, వైద్యుల సలహా లేకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం, ఇతరులకు సిఫార్సు చేయడం చేయరాదని సూచించారు. జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులకు అనవసరంగా యాంటీబయాటిక్స్ వినియోగించడం వల్ల సూక్ష్మజీవుల్లో మందులను తట్టుకునే సామర్థ్యం పెరిగి, భవిష్యత్తులో మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. దీనినే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారని తెలిపారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగా సాధారణ ఇన్ఫెక్షన్లకు సైతం చికిత్స కష్టతరమవుతుందని, వైద్య ఖర్చులు పెరగడంతో పాటు ఆసుపత్రుల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య మానవ ఆరోగ్యంతో పాటు జంతువులు, పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో 'స్టాప్ ఏఎంఆర్' నినాదంతో యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించి ప్రస్తుత, భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారం రోజులపాటు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. శంకర్, డాక్టర్ బి. శాంతిరెడ్డి, డాక్టర్ షారన్ సోనియా, డాక్టర్ ఎస్. ఉమామహేశ్వరరావు, డాక్టర్ పరదేశి నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. అంజనేయబాబు నాయక్, డాక్టర్ చందె సునీల్ కుమార్, ఇతర అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్