స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు
ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి
పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలు, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మంగళవారం అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు,మున్సిపల్ కమిషనర్లు,జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు,పోలింగ్ నిర్వహణ,శాంతిభద్రతలు, ఎన్నికల సిబ్బంది సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన ఎన్నికల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. ఈ నెల 26న జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు,తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని,పోలింగ్ సిబ్బంది కి అవసరమైన ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల వివరాలు
జిల్లా లోని కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న కాకినాడ గ్రామీణం,కరప, సామర్లకోట,పెద్దాపురం, తాళ్లరేవు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఐదు మండలాల పరిధి లో మొత్తం 93 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రకటన వెలువడగా, వాటిలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 89 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. సర్పంచ్ పదవులకు సంబంధించి 5 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 265 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మొత్తం1,064 వార్డు సభ్యుల స్థానాలకు గాను 195 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన వార్డులకు 2,031 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీ ల వివరాలను వెల్లడిస్తూ కరప మండలంలోని పాతర్లగడ్డ, సామర్లకోట మండలంలోని బోయనపూడి, పెద్దాపురం మండలంలోని వడ్లమూరు, తాళ్లరేవు మండలంలోని నీలపల్లి గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవమైనట్లు తెలిపారు.
1,056 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు ..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో మొత్తం 488 ప్రాంతాల్లోని 1,056 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సామగ్రి పంపిణీ, ఎన్నికల సిబ్బంది రవాణా, విధుల కేటాయింపు తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ రోజున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని,ఓట్ల లెక్కింపు తదితర తదుపరి ప్రక్రియలకు కూడా అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మున్సిపల్ అధికారులు,పోలీసు అధికారులు సమన్వయం తో పనిచేస్తూ పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీ తనం ప్రధానంగాఉండాలని, ప్రతి ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.వి.లక్ష్మణరావు,జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, అదనపు ఎస్పీ ఎం. కిషోర్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)