మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజధాని రైతు వేదన

1 గంట క్రితం

Tension in Undavalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడిచినా విభజిత ఆంధ్రప్రదేశ్‌‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించి అంతే సమయం అయినా రెండు మార్లు దేశ ప్రధాని కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా రాజధాని ప్రాంత రైతుల రోదనలు ఇంకా కొనసాగడం ఏలికల కాఠిన్యానికి తిరుగులేని తార్కాణం. రాజధాని నిర్మాణానికి సమీకరణలో భూములిచ్చిన రైతుల వేదన ఒక రకమైతే తదుపరి దశల్లో భూములివ్వాల్సిన వారిది ఇంకో రకం ఆందోళన. బలవంతపు భూసేకరణ కిందకు వచ్చే వారి గోస చెప్పనలవికానిది. ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు నిర్మాణం ప్రారంభమై దాదాపు దశాబ్దం. వైసిపి హయాంలో మూడు ముక్కలాటతో రాజధాని నిర్మాణం కుంటుపడింది. కాగా ప్రతిపాదిత సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు మధ్య మధ్యన ల్యాండ్‌ ‌పూలింగ్‌‌కు 2.47 ఎకరాలిచ్చేందుకు రైతులు సుతరం అంగీకరించలేదు. ప్రభుత్వం, సిఆర్‌‌డిఎ ఇవ్వజూపిన పరిహారం తమకు న్యాయ సమ్మతంగా లేదంటూ పలు మార్లు ఆందోళనలు చేయడంతో పాటు ప్రభుత్వానికి విన్నవించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా పరిహారం విషయంలో ప్రభుత్వం భీష్మించింది. రైతులు సైతం ప్రభుత్వం నిర్ణయించి అవార్డు చేసిన పరిహారానికి ఒప్పుకోలేదు. తమకు న్యాయం చేయమని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగా, కోర్టులకు శని, ఆదివారాలు సెలవులున్న సమయంలో పక్కా వ్యూహంతో వందలాది మంది పోలీసులతో సిఆర్‌‌డిఎ, రెవెన్యూ అధికారులు రైతుల భూముల్లోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేయడం రాక్షసత్వాన్ని తెలుపుతుంది. రైతులు అడ్డు చెప్పినా, వేడుకున్నా మహిళలని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చిపారేసి జెసిబిలు, బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేసి నేలను చదును చేసి ఆగమేఘాల మీద రహదారి నిర్మాణానికి బరితెగించారు. తమకు అవార్డు పత్రాలు అందలేదని మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఇదీ భవిష్యత్తు తరాల కోసం నిర్మించే రాజధానికి భూములిచ్చి సమిధలవుతున్న త్యాగధనుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం!

రాజధానికి తొలుత టిడిపి ప్రభుత్వం పూలింగ్‌‌కు ప్రతిపాదించినది 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాలు. ప్రభుత్వ భూములతో కలిపితే తొలి దశలో తీసుకునేది 54 వేల ఎకరాలు. అసలు పూలింగ్‌ ‌విధానమే పెద్ద మోసం. గ్యాంబ్లింగ్‌ ‌వంటిది. రైతులకు కొన్నేళ్లపాటు కౌలు, వంటి తాత్కాలిక ఉపశమనాలు తప్ప పరిహారం రూపాయి ఇవ్వరు. ఎప్పటికో రిటర్నబుల్‌ ‌ప్లాట్లు ఇస్తారు. వాటికి రేటు వస్తుందని నమ్మబలుకుతారు. ఫక్తు రియల్‌ ఎస్టేట్‌ ‌దందా. ఇది నచ్చక రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ విధంగా తొలి దశలో రైతులు ఇవ్వకుండా ఉన్న 2,600 ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ కింద తీసుకుంటోంది. ఆ విధంగా లాక్కొనే భూములకు అవార్డు పేరిట ధర నిర్ణయిస్తోంది. బహిరంగ మార్కెట్‌‌లో అక్కడ ఎకరం రూ.ఏడు కోట్ల వరకు ఉండగా సర్కార్‌ ‌వారి పాట సుమారు రెండున్నర కోట్లు. ఈ భూముల ధరలనే ఆర్థిక సంస్థల వద్ద రుణాల కోసం ఎకరం రూ.50 కోట్ల వరకు చూపిస్తోందని రైతులు అంటున్నారు. తరతరాలుగా భూములను అన్ని హక్కులతో అనుభవిస్తున్న, అదే జీవనాధారం అయిన రైతుల భూములపై ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం క్రూరత్వంతో కూడుకున్నది.

రాజధానికి అన్నేసి వేల ఎకరాలెందుకన్న అభ్యంతరాలు తొలి దశ సమయంలోనే రాగా, ఇప్పుడు మరిన్ని దశల్లో భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం రాజధాని రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. తొలి విడతలో పూలింగ్‌‌కు భూములిచ్చిన వేల మందికి ఇస్తామన్న రిటర్నబుల్‌ ‌ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనేలేదు. ఇచ్చినవి చెరువుల్లో, పనికిరాని ప్రాంతాల్లో కేటాయించారన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. భవిష్యత్తులో సమీకరించే 50 వేల ఎకరాల, రైతుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. నయానో భయానో పూలింగ్‌, భూసేకరణల ద్వారా లక్ష ఎకరాల వరకు రాజధానికి తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో చెప్పిన బాహుబలి రాజధాని కాస్తా డబుల్‌, ట్రిపుల్‌ ‌బాహుబలి రూపాన్ని సంతరించుకుంటోంది. ఇంతటి రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చే సహాయమేంటో తెలీదు. విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాలని ఉంది. కేంద్రమేమో రుణాలిప్పిస్తామంటోంది. ఆ అప్పులు ప్రజలే తీర్చాలి. నిర్మించేది ప్రజా రాజధాని కాదు. కార్పొరేట్ల కేపిటల్‌. భూములిచ్చిన రైతులకు, ప్రజలకు స్థానం ఉండదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్