మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారిశ్రామిక ప్రమాదాలు ఆగేదెన్నడు?

2 గంటల క్రితం

Visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వరుసగా జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు ఉపరితల అంశాలతో ఆగకుండా, మౌనం వీడి వాటి మూలాలపై మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. భద్రతా వైఫల్యాలతో వాటిల్లే భవిష్యత్‌ ప్రమాదంపై హెచ్చరిస్తున్నాయి.

భారతదేశ పరిశ్రమలలో భద్రతకు పరిశ్రమాధిపతులు ప్రాధాన్యత ఇవ్వని కారణంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. 2015 నుంచి 2024 మధ్య నమోదైన ప్రమాదాల్లో దాదాపు 7,150 మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో అత్యధికం గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లో నమోదైనట్లు కార్మిక మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2022లో సెంటర్‌ ఫర్‌ సైన్సు అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సి.ఎస్‌.ఇ) అధ్యయనం ప్రకారం 2020 తరువాత 30 నెలల్లో దేశంలో 130కి పైగా జరిగిన రసాయన ప్రమాదాల్లో 200 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఫ్యాక్టరీ అడ్వైజ్‌ సర్వీస్‌ అండ్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (డి.జి.ఎఫ్‌.ఎ.ఎస్‌.ఎల్‌.ఐ) ప్రకారం భారత దేశంలో నమోదైన ఫ్యాక్టరీలలో సగటున ప్రతి రెండు రోజులకు ఒక పెద్ద పారిశ్రామిక ప్రమాదం జరుగుతోంది. విశాఖ ఉక్కు స్టీల్‌ప్లాంట్‌లో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ పాటించకపోవడంతో జూన్‌ 8న జరిగిన భారీ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతిచెందారు. పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాలు అమలు చేయని విషయం తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. దేశంలో ఏ స్థాయి పరిశ్రమలో ప్రమాదం జరిగినా యాజమాన్య భద్రతా ప్రమాణాల వైఫల్యాలు బహిర్గతమవుతూనే వున్నాయి.

గతంలో ప్రైవేటు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు, ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలకూ వ్యాపించాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలను వదిలించుకొని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనలో వచ్చిన మార్పుతో భద్రతను విస్మరించాయి. కార్మికుల భద్రత తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో ప్రమాదాలు పెరగడానికి దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వమేదైనా యజమానుల లాభాలకు గ్యారంటీ ఇస్తున్నాయేగానీ పని ప్రదేశంలో ప్రమాదాలకు గురవుతున్న కార్మికుల ప్రాణాలకు భరోసా ఇవ్వడంలేదు.

ప్రైవేటు పరిశ్రమాధిపతులకు ప్రజల ఆస్తులను దోచిపెట్టి, కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా సవరించి, కార్మిక హక్కులను బలహీనం చేయడం, భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కార్పొరేట్లు, బడా వ్యాపారులు బహిరంగ చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి.

1948 ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్‌ 41జి ప్రకారం పరిశ్రమల్లో కార్మికుల భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం కార్మిక, యాజమాన్య ప్రతినిధులు, సంబంధిత అధికారులతో భద్రతా కమిటీ ఏర్పాటు చేయాలి. కనీసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై భద్రతను సమీక్షించి, లోపాలను యాజమాన్యం సరిచేయాలి.

ఎటువంటి భౌతిక తనిఖీలు నిర్వహించకుండానే పరిశ్రమలకు రోజుల వ్యవధిలో అనుమతులు జారీ చేసే స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పరిశ్రమ నిర్మాణంలోనూ, ఉత్పత్తి ప్రారంభానికి ముందు పరిశీలించే ఉన్నత ప్రమాణాలు వదిలేసింది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం, పరిశ్రమల్లో అగ్నిమాపక వ్యవస్థలు, అలారాలు, సెన్సార్లు, ఎక్స్‌టింగ్విషర్లు, ఫైర్‌ ఎగ్జిట్లు లేకుండానే నిర్వహిస్తున్న పరిశ్రమాధిపతులున్నారు. నిర్మాణ ఖర్చులు తగ్గించుకొనేందుకు పరిపాలనా కార్యాలయాలను పరిశ్రమలకు పక్కనే నిర్మిస్తున్నారు. దేశంలో నమోదైన పరిశ్రమల ప్రమాదాల్లో రోజుకు సగటున ముగ్గురు కార్మికులు మృతి చెందుతున్నారు. పని ప్రదేశంలో ప్రతీ సంవత్సరం 31 శాతం గాయాల పాలయ్యేవారి సంఖ్య పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.

పరిశ్రమ నిర్మాణ ఉల్లంఘనలకు పాల్పడిన, భద్రతను విస్మరిస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. యంత్రాలను అప్‌గ్రేడ్‌ చేయించి, అధునాతన భద్రతా సాంకేతికతను ఉపయోగించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కానీ ఈ పని ప్రభుత్వాలు చేయడానికి సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు. మన రాష్ట్రంలో 24,300 పరిశ్రమలకు ఎనిమిది మంది ఫ్యాక్టరీ ఇనస్పెక్టర్లు వున్నారు. మూడు వేల పరిశ్రమలకు ఒక ఇన్‌స్పెక్టర్‌ వున్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రభుత్వ, ఫార్మా, ఇతర పరిశ్రమలున్న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టరే లేరు. గతంలో పరిశ్రమలను తనిఖీ చేసే అధికారం, ప్రమాదాలకు కారణమైన యాజమానులను ప్రాసిక్యూషన్‌ చేసే అధికారం ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లకు వుండేది. ఇపుడా అధికారాన్ని టిడిపి కూటమి ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంది.

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు భద్రతపై జవాబుదారీతనం పెంచేలా దేశ వ్యాపిత వ్యవస్థను ఏర్పాటుచేసి బలోపేతం చేయాలి. నిబంధనలు పాటించని యజమానులకు జరిమానాలు భారీగా విధించాలి. శిక్షలు కఠినంగా వుండాలి. పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా చట్టబద్ధమైన ఏకీకృత వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఆ తరహా వ్యవస్థను సాధించుకొనే వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. కార్మికులకు పౌర సమాజం తోడుగా నిలబడాలి.

Kanta Rao

వ్యాసకర్త- గుల్ల కాంతారావు

సెల్‌: 94900 99487 /


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్