శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకుల మాట - కోయిల పాట

22 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కాకులున్న అడవికి

కోకిలొకటి వచ్చింది

కావు కావు కూతలలో

కుహుకుహు పలికింది

ఎక్కడదీ రాగమంటూ

కాకులన్నీ వెతికాయి

తియ్యని ఆ కోయిలను

వెంటనే కనిపెట్టాయి

మాకురాని ఈ రాగం

నీకెలాగు వచ్చినది?

ఇద్దరమూ ఒకే రంగు

కూతలలో ఎలా మార్పు!

వాయసమ్ము అన్నమాట

వినగానే వినయంగా

‘సృష్టిలో ఒక్కొక్కరిది

ఒక్కోరంగు ఒక్కోరూపు

మన మధ్య తేడాలకు

సమాధానమే లేదులే!

రంగు రూపు పోలికున్న

జాతి భేద మున్నదిలే

మీతో నాకు పోలికేల

రాగముంటే చాలునా!

అందరూ కలిసుండే

ఐక్యతుంది మీలోనా!

బాధలలో పక్కనుండి

సాయపడే గుణం మీది

దొరికినదేదైనా గాని

కలిసి తినే జాతి మీది

ఒక్క గొంతు సుధ తప్ప

నాకు ఏది మీ జ్ఞానం

గుడ్లు కూడా పొదగలేని

పక్షులలో అజ్ఞానిని

మా అందరి జన్మస్థలం

సుందరమగు మీ గూడే

రెక్కలొచ్చే వయసు దాకా

మమ్ముల చూచేది మీరే’

కోయిలమ్మ మాట విని

సంతసించే కాకమ్మలు

నీవే మా నేస్తమంటూ

చుట్టూ వచ్చి చేరినాయి

‘మాతోనువ్వు కలిసుంటే

మంచి పాట పాడాలి

మా ముద్దుల పిల్లలకు

పాట విలువ తెలియాలి’

‘తెలిసున్న ఈ విద్యను

అందరికి పంచుతాను

పంచితేనే పెరుగుననే

మాట నిజం చేస్తాను’

కోయిలమ్మ ప్రత్యేకత

పిల్లలన్నీ చూచినవి

కుహుకుహు పాటవింటూ

నిదురలోకి జారినవి

- కూచిమంచి నాగేంద్ర,

91821 27880.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్