మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమ్మ ప్రేమ చెట్టు

12 గంటల క్రితం

కథ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 04:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒకరోజు సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన జున్నుబాబు లచ్చవ్వ దగ్గరకు వచ్చి, “అవ్వా! ఈ రోజు మా సార్ ప్రతి విద్యార్థి తన అమ్మ పేరున ఒక మొక్క నాటి, దాన్ని పెంచాలని చెప్పారు. ఎందుకవ్వా?” అని అడిగాడు. “చెట్టు మనకు ప్రాణవాయువును ఇస్తుంది, చల్లని నీడనిస్తుంది, పక్షులకు ఆశ్రయమిస్తుంది. అందుకే దానిని జీవులకు ప్రాణదాత అంటారు” అంది లచ్చవ్వ. “సరే అవ్వా... చెట్టు గొప్పదనం అర్థమైంది. కానీ అమ్మ పేరునే ఎందుకు నాటాలి?” అని అడిగాడు జున్నుబాబు. లచ్చవ్వ చిరునవ్వు నవ్వుతూ, “అమ్మ మనకు జీవాన్ని ఇస్తుంది. ఆమె పేరున నాటిన చెట్టు ఆ జీవాన్ని మరెందరికో పంచుతుంది. అందుకే అమ్మ పేరున మొక్క నాటడం అంటే అమ్మ ప్రేమను ప్రకృతిలో నాటినట్లే” అంది. “ఓహో! అంతేనా?” అన్నాడు జున్నుబాబు. “అంతే కాదు నాయనా! మొక్కను నాటగానే సరిపోదు. తల్లి బిడ్డను ఎలా ప్రేమగా పెంచుతుందో, మొక్కను కూడా అలాగే పెంచాలి. నీళ్లు పోయాలి, కాపాడాలి. అప్పుడే అది మహావృక్షమై ఎందరికో ఉపయోగపడుతుంది” అంది లచ్చవ్వ.

మరుసటి రోజు పాఠశాలలో ప్రతి విద్యార్థి అమ్మ పేరున ఒక మొక్క నాటారు. జున్నుబాబు కూడా మామిడి మొక్కను నాటి, దాని పక్కనే “అమ్మ ప్రేమ చెట్టు” అని చిన్న బోర్డు పెట్టాడు. సాయంత్రం మొక్కకు నీళ్లు పోస్తున్న జున్నుబాబును చూసిన తల్లి, “ఏంటి బంగారం, ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు?” అని అడిగింది. “నువ్వు నన్ను పెంచినట్టు... నేను ఈ మొక్కను పెంచాలి కదా అమ్మా!” అన్నాడు జున్నుబాబు. ఆ మాట విన్న తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. ప్రేమగా జున్నుబాబు తలను నిమిరింది. “ప్రతి బిడ్డా నీలా ఆలోచిస్తే... ఈ భూమంతా పచ్చని తోట అవుతుంది” అంది. ఆ రోజు నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక మొక్క నాటాలని, తన స్నేహితులతో కూడా మొక్కలు నాటించాలని జున్నుబాబు నిర్ణయించుకున్నాడు.

నీతి: అమ్మను ప్రేమించే ప్రతి మనసు ప్రకృతినీ ప్రేమించాలి. అమ్మ పేరున నాటిన ఒక మొక్క తరతరాలకు జీవాన్ని పంచే మహా కానుక.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు,

ఆంగ్ల ఉపాధ్యాయులు, శృంగవరపుకోట,

94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్