mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంక నక్కర కాయ

19 గంటల క్రితం

chinnari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒకరోజు ఉదయం లచ్చవ్వ ఇంటి వరండాలో కూర్చొని ఉంది. ఇంతలో పొరుగింటి సింహాచలం వచ్చి కబుర్లు చెప్పసాగింది. ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉండగా, ‘మామ్మా... మామ్మా...’ అంటూ గుక్కపట్టి ఏడుస్తూ సింహాచలం మనవడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమె ఒడిలో వాలిపోయాడు. ‘ఏమైందిరా నాయనా?’ అంటూ సింహాచలం వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అది చూసిన లచ్చవ్వ నవ్వుతూ, ‘ఒరేయ్ బంక నక్కర కాయ! ఇలా రా!’ అంటూ చేతులు చాచింది. ‘నేను రాను!’ అంటూ ఆ బాలుడు తన అమ్మమ్మను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ‘అయ్యో! ఎంత ఏడ్చావురా! నీ కన్నీళ్లతో చిన్న చెరువే నిండిపోతుందేమో!’ అంది లచ్చవ్వ. ‘వీడు ఇంతేనండీ. నేను ఒక్క క్షణం కనిపించకపోయినా వెతుక్కుంటూ వచ్చి ఏడుస్తాడు. నీడలా నాతోనే ఉంటాడు. నన్ను అస్సలు వదలడు’ అంది సింహాచలం. అది విన్న జున్నుబాబు ఆసక్తిగా, ‘మామ్మా! బంక నక్కర కాయ అంటే ఏమిటి?’ అని అడిగాడు.


లచ్చవ్వ చిరునవ్వుతో, ‘బాబూ! బంక నక్కర కాయ అనేది ఒక జాతీయం. బంక అంటే ఒకదానికి ఒకటి అంటుకునేలా చేసే జిగురు పదార్థం. నక్కర చెట్టు కాయల నుంచి వచ్చే జిగురు ఏదైనా వస్తువుకు అంటుకుంటే సులభంగా వదలదు. అందుకే దానిని బంక నక్కర కాయ అంటారు. వీటినే కొన్ని ప్రాంతాల్లో నక్కెర కాయలు అని కూడా పిలుస్తారు. అలాగే కొందరు పిల్లలు తమకు ఇష్టమైన వారిని వదలకుండా ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటారు. అలాంటి వారిని ప్రేమగా ‘బంక నక్కర కాయ’ అంటారు’ అని చెప్పింది. ‘అంటే ఈ బాబు తన అమ్మమ్మను వదలకుండా ఉంటాడు కాబట్టి బంక నక్కర కాయ అన్నమాట కదా!’ అన్నాడు జున్నుబాబు. ‘అవును బాబూ! సరిగ్గా అర్థం చేసుకున్నావు’ అంది లచ్చవ్వ. అప్పుడు జున్నుబాబు నవ్వుతూ, ‘భలే భలే! అయితే నేను కూడా నీ బంక నక్కర కాయనే, మామ్మా!’ అన్నాడు. అది విని లచ్చవ్వ, సింహాచలం ఇద్దరూ పకపకా నవ్వారు. సింహాచలం మనవడు కూడా ఏడుపు మరిచి నవ్వేశాడు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,

94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్