31 వరకు సమ్మె కొనసాగింపు హెచ్చరిక...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ జారీ చేసిన జీఓ నెం.396ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు గార్లపాటి నాగభూషణం డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పల్నాడు జిల్లా, నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ప్రకాష్ నగర్ లో సోమవారం చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. ఈ నెల 31వ తేదీ వరకు సమ్మె కొనసాగుతుందని దస్తావేజు లేఖరులు హెచ్చరించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజుల తయారీ ప్రక్రియను కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.396ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్‌డౌన్ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సీనియర్ డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ మాట్లాడుతూ ప్రజల ఆస్తుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దస్తావేజు లేఖరులు, స్టాంపుల విక్రేతలు, డిటిపి ఆపరేటర్లు, లేఖరుల సహాయకుల జీవనోపాధిని పరిరక్షించాలని కోరారు. దస్తావేజు లేఖరుల లైసెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు జరుగుతున్న సమ్మెకు క్రయవిక్రయదారులు, జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు లేఖరుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్తంభించింది. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి జుజ్జూరి సుబ్బాచార్యులు, సభ్యులు పసుమర్తి చంద్రశేఖర్, అరిపిరాల రవి ప్రసాద్, ఏరువ మోహన్ రెడ్డి, పుచ్చా కిరణ్, బండారు రాంబాబు తదితర డాక్యుమెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)