మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ‘రైతుల ప్రతిజ్ఞా దినం’ : ఎఐకెఎస్‌

3 గంటల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)తీసుకున్న నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జులై 22న ‘ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు (ఎఫ్‌టిఎ) వ్యతిరేకంగా రైతుల ప్రతిజ్ఞా దినం’ పాటించాలని అన్ని విభాగాలను, రైతులను కోరింది. ఈ మేరకు ఎఐకెఎస్‌ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత్‌-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనుంది. ఈ చర్య దేశ వ్యవసాయం, ఆహార సార్వభౌమత్వం, గ్రామీణ జీవనోపాధితో పాటు లక్ష‍లాది మంది రైతుల భవిష్యత్తు, వ్యవసాయ కార్మికులు, ఇతర చిన్న తరహా ఉత్పత్తిదారులపై తీవ్రమైన ముప్పును కలిగించనుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఒప్పందం కోసం భారీగా రాయితీ పోందిన వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారతీయ మార్కెట్‌ను తెరవడాన్ని విమర్శించింది. అలాగే వ్యవసాయ రంగం పూర్తిగా కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


కార్పోరేట్‌ అనుకూల, సామ్రాజ్యవాద అనుకూలవాణిజ్య ఒప్పందాలను చేపట్టకూడదని, అన్ని రైతు వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అన్ని పంటల సేకరణకు హామీఇస్తూ, సి2+50శాతం వద్ద కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన హామీని అమలు చేయాలని, రైతులకు సమగ్రమైన రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేసింది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం భారతీయ వ్యవసాయాన్ని బలి ఇవ్వడానికి బదులుగా, తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించే విధానాలను అనుసరించాలని డిమాండ్ చేసింది.


రైతు వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నింటినీ ప్రతిఘటించాలన్న భారత రైతాంగ సంకల్పానికి సంఘీభావంగా బుధవారం జరగనున్న కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ఎస్‌కెఎం, ఇతర మిత్రపక్ష‍ సంస్థలతో సమన్వయం చేసుకుని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తమ విభాగాలకు సూచించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్