న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారిక నివాసం ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ అధికారిక నివాసం ఎదుట రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్నారు. ఎంపిలు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ సహా పలువురు నేతలు ఈ నిరసన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన మార్చ్‌లో ఆందోళనకారులపై పోలీసుల చర్యకు నిరసనగా ప్రధాని మోడీ, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్‌షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చలో సంసద్‌పై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్‌తో పలువురు ఆందోళనకారులు గాయపడిన మరుసటి రోజు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల రెండో రోజున ఈ పరిణామం చోటుచేసుకుంది.
సోమవారం విద్యార్థులపై జరిగిన దారుణాలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం వరకు పాదయాత్ర చేపట్టామని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేదు, పార్లమెంటులో చర్చ చేపట్టేందుకు కూడా ఇష్టపడటం లేదని అన్నారు. భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని, హోం మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని నివాసం ఎదుట నిరసనకు ముందు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని మండిపడ్డారు. "విద్యా వ్యవస్థ, పరీక్షల విధానం పూర్తిగా విఫలమయ్యాయని, అవి దాదాపు కనుమరుగయ్యాయని దేశం మొత్తానికి తెలుసు. పరీక్షల వ్యవస్థను చెదపురుగులు తినేసినట్లుగా లోపల నుంచే నాశనం చేశారు. విద్యార్థులు చెబుతున్నది అదే; మేము కూడా అదే చెబుతున్నాం. దీనిపై నేను వరుసగా ప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాను. అయినా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యపై చర్చించాలని స్పీకర్‌ను కోరామని, చర్చ చేపట్టాలంటే ప్రభుత్వం అనుమతి కావాలని చెప్పారని అన్నారు. అంటే ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ చేపట్టాలంటే ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ ప్రకటించారని అన్నారు. విద్యార్థులపై పోలీసుల తీరును "భారతీయతకు విరుద్ధమైనది"గా అభివర్ణించారు. ఈ దేశ యువత పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అన్నారు. దేశంలోని యువతకు అవకాశాలు లేవని, అన్ని మార్గాలు మూసుకుపోయాయని, చివరకు పోటీ పరీక్షల రూపంలో ఉన్న ఏకైక మార్గం కూడా ఇప్పుడు దెబ్బతినిందని అన్నారు. ప్రస్తుతం దేశ యువత కేవలం విద్యా విధానం గురించే కాకుండా, తమ భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందుతోందని అన్నారు. అధికార బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ దేశ విద్యా వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకుందని మండిపడ్డారు. విద్యార్థుల కంటే పారిశ్రామికవేత్తలకే మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని విమర్శించారు. "ఇది కేవలం విద్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశంలో తమకు భవిష్యత్తు లేదని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వారి ఆందోళన సమంజసమైనదని అన్నారు. ఈ పరిస్థితికి కారణమైన ప్రధాని, హోంమంత్రి, ధర్మేంద్ర ప్రధాన్‌లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)