బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సహకారం..

59 నిమిషాల క్రితం

chinnari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 03:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రామయ్యకు రెండెకరాల పొలంలో బోరు నీళ్లు పుష్కలంగా ఉండటంతో పంటలు మార్చి, మార్చి వేసి మంచి లాభాలు గడించాడు. రామయ్య తోట ప్రక్కనే సోమయ్యకు మామిడి తోట వున్నా బోరులో నీళ్లు లేక చెట్లు ఎండిపోయాయి. రామయ్యకు మంచి లాభాలు వస్తుండటంతో దుర్బుద్ధి కలిగిన సోమయ్య, రామయ్య బోరులో రాళ్లు వేశాడు. అది రామయ్య గమనించినా ఊరుకున్నాడు. కొన్ని రోజులకు రామయ్య బోరుకు సమాంతరంగా సోమయ్య బోరు వేశాడు. ఎంత లోతు వేసినా నీళ్లు పడలేదు. వున్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఈలోపు రామయ్య తన బోరుకు మరమ్మతులు చేయించి యథావిధిగా నీళ్లు పారించుకున్నాడు. అప్పుడే సోమయ్య, రామయ్య దగ్గరకు వచ్చి ‘నా తోటకు మీ నీళ్లు కావాలి. ఇస్తావా?’ అని అడిగాడు. ‘ఓ పెట్టుకో సోమయ్య నీళ్లు లేక నీ తోటలో చెట్లు ఎండిపోయాయి. చాలా రోజుల నుండి చూస్తున్నాను. బోరులో నీరు పట్టుకోమని నేనే చెబుదామనుకున్నాను’ అన్నాడు. రామయ్య మంచితనానికి సోమయ్య పశ్చాత్తాపపడ్డాడు. రామయ్య చేసిన సాయంతో సోమయ్య తన తోటకు నీళ్లు పారించుకున్నాడు. చెట్లు చిగురించాయి. కాయలు బాగా కాశాయి. క్రమంగా లాభాల బాట పట్టాడు.

ఒక రోజు మార్కెట్‌లో ఇద్దరూ కలిశారు. సోమయ్యకు మంచి లాభం వచ్చింది. రామయ్య అతన్ని అభినందించి ‘నీ కష్టాలు అన్నీ తీరాయి, చెట్లు బాగున్నాయి. ఇద్దరం వంతులు మాదిరిగా నీళ్లు వాడుకుందాం’ అన్నాడు. ఆ మాటకు సోమయ్య తల దించుకుని ‘నీ మేలు మరువలేను, నీకు చాలా ద్రోహం చేశాను. నన్ను క్షమించు’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి రామయ్య ‘అవేం మాటలు సోమయ్య. మనం మనుషులం... ఒకరికొకరు సాయంగా నిలబడాలి’ అన్నాడు. ‘అవును నువ్వు చెప్పింది నిజమే... నేను చాలా దురాశతో నీ బోరులో రాళ్లు వేశాను. అయినా నువ్వు, నాకు సహాయం చేశావు. నీ మంచితనానికి కృతజ్ఞతలు’ అని చేతులు జోడించి రామయ్యకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు నుంచి ఒకరికొకరు సహకరించుకుని వారిద్దరూ మంచి లాభాలు గడించారు.


- కనుమ ఎల్లారెడ్డి,

తాడిపత్రి, 93915 23027.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్