జంతర్ మంతర్ లో
ఎన్నెన్నో ముచ్చట్లు
మరెన్నో భోగట్టాలు
రేప్పొద్దున్న సెప్పుకోడానికి
కావాల్సినన్ని సంగతులు.
ఒకటా రెండా ఎన్నని ఊసులు
గుంట పిల్లలు పిడికిలి పట్టారట
గొంతెత్తి అరిశారట మంత్రివారు
కుర్సీ దిగి పోవాలని మొండిగా
ఒకటే మాట.. నీదైనా.. నాదైనా.
అప్పుడెప్పుడో ఇన్నాం...
జనసముద్రం ఉప్పొంగిందని
ఇప్పుడు కళ్లెదుటే సూత్తున్నాం
సంద్రం పోటెత్తితే ఎవరడ్డగలరు
జన్‌జి లొక్కటైతే ఎవరాపగలరు.
ప్రభువులవారు తలుసుకుంటే
దెబ్బలకి కరువేటని ఇన్నాంకదా
పోయేకాలం దాపురిత్తే అంతే...
పోలీసోళ్లు కర్రకి మేకులు గుచ్చి
కొట్టినచోట కొట్టకుండా కొట్టారు.
పెల్లెట్ల గన్నుతో కాల్చారు
నీటి ఫిరంగులు పేల్చారు
బాష్ప వాయువు వదిలారు
కొడితే కొట్టండి గాని ఈ పువ్వుని
ప్రేమగా ఇత్తున్నాం తీసుకోండి.
మేము ఏటి మేమే జన్‌జీ లం
సుర సుర మండే సూర్యులం
మా నెత్తురు..సత్తువ సూత్తేగాని
మీ ఏలినోళ్లు పొగరు దిగనేదు
మాకు నాయం జరగానేదు...
పోరగాళ్ళు పోరాడితే నేరగాళ్లు
దిగి రాక తప్పుతుందా సెప్మి
ఇదే కదేటి జంతర్ మంతర్ లో జరిగింది...
అయినా ఇది చివర
కాదు..కానే కాదు..ఇది మొదలే.
- రెడ్డి శంకరరావు,
సెల్: 9494333511







కామెంట్‌లు (0)