ప్రపంచానికి పారిస్ అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గుర్తుకు వస్తాయి. ఫ్రెంచ్ రిపబ్లిక్ విలువల్లో సమానత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నగరంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్ దగ్గర ‘మహిళలు కనిపించకూడద’న్న వివాదాస్పద పరిస్థితి కల్పించారు. దీనిపై మహిళా సిబ్బంది నిరసన తెలపడం, కొన్ని గంటల పాటు టవర్ దగ్గర కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఈఫిల్ టవర్ ఉద్యోగుల సమస్య కాదు. ప్రపంచంలోని అనేక సమాజాల్లో మహిళలకు ఇప్పటికీ ‘ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు’, ‘ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు’, ‘ఎప్పుడు బయటకు రావాలి, ఎప్పుడు ఇంట్లో ఉండాలి’ అన్న ఆంక్షలను మరోసారి బహిర్గతం చేశాయి. ఆమె చేసే పని ఆధారంగా కాకుండా ఆమె మహిళ అన్న కారణంతో ఒక ప్రదేశంలో కనిపించకుండా చేయడం తీవ్రంగా ఖండించాలి. సందర్భం ఏదైనా నిర్బంధాలు, నియంత్రణల చుట్టూనే మహిళలు జీవించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మతం పేరుతో, మరికొన్ని చోట్ల సంస్కృతి పేరుతో, ఇంకొన్ని కుటుంబ గౌరవం పేరుతో ఆమె ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇది ఎక్కడో పారిస్‌లో ఒకరోజు జరిగిన సంఘటన కాదు.. ఒక చిన్న సంఘటనలోంచి బయటకు వచ్చిన పెద్ద సామాజిక భూతం..
సెప్టెంబర్ 5న గుజరాత్ కు చెందిన స్వామినారాయణ సంస్థ (బిఎపిఎస్) ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. సుమారు 100 మంది సభ్యులతో కూడిన ఆ బృందం అక్కడ హిందూ ఆలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ‘తాము టవర్ ను సందర్శించే సమయంలో మహిళా ఉద్యోగులను పరిమితం చేయమని’ చెప్పిందని అక్కడి ఉద్యోగులు ఆరోపించారు. అందుకనుగుణంగా ఆ రోజు మహిళా సిబ్బంది పనిచేయాల్సిన విధుల్లో పురుషులను బాధ్యతల్లో ఉంచారు. అలాగే ‘బృందం సంచరించే కొన్ని ప్రాంతాలకు తాము వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చార’ని ఉద్యోగులు చెప్పారు. ‘తమ స్థానాలను పురుషులతో భర్తీ చేయడం, ఆ రోజు మమ్నల్ని కనిపించకుండా చేయడం చాలా అవమానంగా అనిపించింద’ని ఆగ్రహించిన మహిళా ఉద్యోగులు సెప్టెంబరు 7న నిరసన తెలిపారు.
ప్రపంచంలోని దాదాపు అన్ని మత సంప్రదాయాల్లో అనాదిగా పురుషులు-మహిళలకు సంబంధించిన కొన్ని ఆచారాలు, పరిమితులు పాటిస్తున్నారు. అయితే వ్యక్తిగత విశ్వాస పరిధిలో ఉన్నంత వరకు వాటిని గౌరవించడం ప్రజాస్వామ్య సమాజం లక్షణం. కానీ ఒకరి విశ్వాసం కారణంగా మరొకరి ఉనికి ప్రమాదంలో పడడం ఎంతమాత్రం ఆమోదించకూడదు. ఒక సందర్శకుడి మత విశ్వాసం కారణంగా తాను పనిచేస్తున్న చోటు నుండి ఆమెను తప్పించమంటే.. అది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయంగా మాత్రమే చూడకూడదు. ఈఫిల్ టవర్ ఉద్యోగులు ఇదే విషయాన్ని ముందుకు తెచ్చారు. మహిళా ఉద్యోగులను వారి లింగం కారణంగా పక్కకు తప్పించడం తమ కార్యాలయంలోని ‘సమానత్వం, వివక్ష రహిత వాతావరణానికి విరుద్ధమ’ని వారు చాలా స్పష్టంగా చెప్పారు.
ఉద్యోగులు, యాజమాన్యం చర్చల తరువాత మరుసటి రోజు ఈఫిల్ టవర్ తెరుచుకుంది. పర్యాటకులు వచ్చారు. నగరం తన సాధారణ జీవనంలోకి వెళ్లిపోయింది. అయితే ఆకాశాన్నంటే ఆ ఈఫిల్ టవర్ ఎత్తుతో సమానంగా ‘ప్రపంచం ఎంత మారుతున్నా.. ‘మహిళలకు ఇక్కడ స్థానం లేదు’ అన్న ధోరణి ఎప్పుడు మారుతుంది? అన్న ప్రశ్న మాత్రం అక్కడే నిలబడిపోయింది. కొత్త కొత్త పేర్లతో పదే పదే ఆమెను కనిపించకుండా చేసే ప్రయత్నాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటున్నాయి. మత విశ్వాసాల పేరుతో మహిళల స్వేచ్ఛ, సమాన హక్కులు నియంత్రించే చోట్ల ఈ వివక్ష మరింత తీవ్రంగా కనిపిస్తుంది.”
మన దేశంలో..
మహిళలపై మతపరమైన ఆంక్షల విషయంలో మనదేశంలో శబరిమల ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రుతుస్రావం కారణం చెప్పి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు 4:1 మెజారిటీతో కొట్టివేసింది. మహిళలవయసు, శారీరక స్థితి ఆధారంగా పెట్టిన ఆ ఆంక్షలు రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును మత ఛాందసవాదులు స్వాగతించలేదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని వాళ్లు చేసిన రగడ అంతా ఇంతా కాదు. అంతకుముందు మహారాష్ట్రలోని శని శింగణాపూర్ ఆలయం అంతర్భాగంలోకి మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఈ నిషేధానికి వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు ఉద్యమించారు. చివరకు 2016లో ఆలయ ట్రస్టు మహిళలను లోపలికి అనుమతించింది. ముంబయిలోని హాజీ అలీ దర్గాలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్ష కూడా న్యాయపోరాటం తర్వాత తొలగిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు ఆమె తన ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. అయితే సాంప్రదాయ ముసుగులో ఆలయాలు, పవిత్ర స్థలాలకు మాత్రమే ఆమె పోరాటం పరిమితం కావడం లేదు. ఉద్యోగం, ఉపాధి సంపాదించడంలో కూడా అది కొనసాగుతోంది.
ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని మరోసారి బహిర్గతం చేసింది. 14 ఏళ్ల అనుభవం ఉన్న ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రసూతి సెలవు తీసుకుని తిరిగి విధుల్లోకి వచ్చారు. మేనేజర్ హోదాలో ఉన్న ఆమె వచ్చిన తర్వాత జీతం, హోదా అలాగే ఉంచారు. అయితే గతంలో నిర్వహించిన మేనేజీరియల్ బాధ్యతలు మాత్రం తగ్గించారు. ట్రెజరీ విభాగంలో తక్కువ స్థాయి పనికి ఆమెను మార్చారు. దీనిపై ఆ మహిళ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ‘మహిళకు జీతం, హోదా కొనసాగించడం మాత్రమే సరిపోదు. ఆమె బాధ్యత, అధికార పరిధి, కెరీర్ ఎదుగుదల అవకాశాలు కూడా కాపాడాల్సిందే’ అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ రూ.10 లక్షల పరిహారం, రూ.1.5 లక్షల న్యాయ ఖర్చులు ఆ మహిళకు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉదంతంలో ఒకప్పుడు మహిళను ‘పని చేయకు’ అని బయటకు పంపేవారు. ఇప్పుడు ‘పని చేయొచ్చు.. కానీ నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మాత్రం ఉండకూడదు’ అనే వివక్ష కొనసాగించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ఈఫిల్ టవర్‌లో జరిగినట్టుగా మహిళను ‘ఒకరోజు కనిపించకుండా’ చేయడం.. అనాదిగా ఆమెపై జరుగుతున్న వివక్షలో ఒక రూపం మాత్రమే. నియామకంలో కొంచెం వెనక్కి నెట్టడం, ప్రమోషన్ విషయంలో మరోసారి ఆలోచించడం, ప్రసూతి తర్వాత బాధ్యతలు తగ్గించడం, కీలక నిర్ణయాల సమావేశాలకు దూరంగా ఉంచడం.. ఇవన్నీ కనిపించని గోడలే. ఒక్కో మెట్టు చొప్పున ఆమెను వెనక్కి నెట్టుకుంటూ పోతే.. చివరకు అత్యున్నత స్థానంలో ఆమె కనిపించదు. ఈఫిల్ టవర్ ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో.. మహిళా సమానత్వం కూడా అంతే ఎత్తుకు ఎదగాల్సి ఉంది. మహిళ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదో నిర్ణయించే సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఆమెను సమాన భాగస్వామ్యంతో నిలబెట్టే సమాజమే నిజమైన అభివృద్ధికి కొలమానం. వివక్ష లేని సమాజమే.. ప్రపంచం అభివృద్ధికి అసలైన రూపం..







కామెంట్‌లు (0)