గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతోకచుక్క - దుశ్శకునమా?

23 గంటల క్రితం

తోకచుక్క - దుశ్శకునమా? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 04:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తొమ్మిదో తరగతి చదువుతున్న రాముకు సైన్స్‌ పట్ల ఆసక్తి ఎక్కువ. అతని ఆసక్తిని గమనించిన రాము తండ్రి ఓ చిన్న టెలిస్కోప్‌ను కొని ఇచ్చాడు. రాము ప్రతి రోజూ సాయంత్రం టెలిస్కోప్‌తో ఆకాశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండేవాడు. ఓసారి దసరా సెలవులకు పట్టణం నుంచి రాము గ్రామంలో ఉన్న తాతయ్య ఇంటికి వెళ్లాడు. తన వెంట టెలిస్కోప్‌ను తీసుకెళ్లాడు. రాత్రిపూట నక్షత్రాలు చూస్తుంటే తాతయ్య ‘రాము..! పొద్దుపోతుంది. త్వరగా పడుకో’ అంటూ పిలిచాడు. ‘లేదు తాతయ్య.. పట్టణంలో రాత్రివేళల్లో నక్షత్రాలు సరిగ్గా కనిపించడం లేదు. ఇక్కడ అయితే బాగా కనిపిస్తున్నాయి’ అని రాము చెప్పాడు. ‘ఏ చుక్క కోసం చూస్తున్నావు.. రాము?’ అన్నాడు తాతయ్య. ‘తోకచుక్క గురించి తాతయ్య’ అని చెప్పాడు రాము. అంతే.. తాతయ్య గట్టిగా అరుచుకుంటూ మంచంపై నుంచి దుబ్బున లేచాడు. ‘అయ్యో! తోకచుక్క! అయితే ఈ ఏడాది కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది!’ అని అరిచాడు. తాతయ్య అలా కంగారుపడిపోతుంటే.. రాము నవ్వుతూ, ‘అలాంటివి ఏమీ ఉండవు తాతయ్య. తోకచుక్క అంటే ‘ఒక మంచు ముద్ద!’ అంతే’ అన్నాడు.

‘మంచు ముద్దా?’ అంటూ తాతయ్య ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. ‘అవును తాతయ్య. మన సౌరమండలంలో మంచు, ధూళి, రాళ్లతో కూడిన ఒక పెద్ద ముద్దలాంటిది. ఇది సూర్యుడికి చాలా దూరంలో చీకట్లో తిరుగుతూ ఉంటుంది. అది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి వేడికి దానిపై ఉన్న మంచు కరిగి ఆవిరవుతుంది. సూర్యుడి కాంతి, సౌరగాలి ఆ ఆవిరిని వెనక్కి నెడతాయి. అదే మనకు తోకలా కనిపిస్తుంది. ఎప్పుడూ తోక సూర్యుడికి వ్యతిరేక దిశలోనే ఉంటుంది’ అని వివరంగా చెప్పాడు రాము. ‘అదేంటి! తోకచుక్క కనిపిస్తే అరిష్టం అంటారుగా’ అన్నాడు తాతయ్య. ‘పూర్వం రాజుల కాలంలో యుద్ధాలు, కరువులు వచ్చేవి. ఒకేసారి రెండూ జరిగేసరికి ప్రజలు “తోకచుక్క వల్లే అరిష్టం జరిగింది” అని భయపడేవారు. కానీ అది నిజం కాదు. విశ్వంలో ఇటువంటి తోకచుక్కలు చాలా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు భూమికి దగ్గరగా వస్తాయి. వీటి వల్ల ఏ హానీ జరగదు’ అన్నాడు రాము. మనవడి వివరణకు తాతయ్య తెగ మురిసిపోతూ.. ‘ఇవన్నీ నీకు ఎలా తెలుసురా?’ అని మురిపెంగా అడిగాడు. ‘మా సైన్స్‌ టీచర్‌ సురేష్‌గారు వీటి గురించి బాగా చెబుతారు. మమ్మల్ని ఓసారి ప్లానిటోరియంకు కూడా తీసుకెళ్లారు తాతయ్య’ అని రాము చెప్పాడు.

- యం. రాం ప్రదీప్‌

జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు

94927 12836


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్