గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచొప్పదంటు ప్రశ్న

3 గంటల క్రితం

Untitled-1787121198252-2143.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాఘవాపురం ఉన్నత పాఠశాలలో ఆంజనేయులు ఏడవ తరగతి చదువుతున్నాడు. మాస్టార్లు పాఠం చెప్పిన తరువాత వాడు కొన్ని ప్రశ్నలు వేసేవాడు. అవి విన్న అధ్యాపకులు, ‘ఒరే ఆంజనేయులు, ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు కాక నీకేవీ మంచి ప్రశ్నలుండవురా?’ అని నవ్వుతూ అనేవారు. అయితే అలా అన్నప్పుడల్లా వాడికి ‘చొప్పదంటు ప్రశ్న’ అంటే ఏమిటి? అన్న ప్రశ్న కూడా వచ్చేది. దానికి జవాబు వెతకడం కోసం ఆంజనేయులు చాలా ప్రయత్నాలు చేశాడు. మాస్టార్లను అడిగితే కోప్పడతారేమోనని కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయాడు. ఒకసారి ఆ పాఠశాలకు కొత్తగా ఒక తెలుగు మాస్టారు వచ్చారు. ఆయన క్లాసులో పాఠం చెప్పగానే ఆంజనేయులు నేరుగా మాస్టారు దగ్గరకు వెళ్లి.. ‘మాస్టారు.. చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటి?’ అని అడిగాడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, ‘వెనుకటికి ఒక రైతు కొడుక్కి ఒక సందేహం వచ్చిందంట. అదేమిటంటే, ఎద్దు తినడానికి నాన్న రోజూ పొడవాటి చొప్ప (ఎండిన కంది చేను కాడలను ‘చొప్ప’ అంటారు) కట్టలు తెచ్చి పడేస్తున్నాడు. అవి పొడుగ్గా, గట్టిగా ఉంటాయి గదా! నేరుగా నోట్లోకి వెళ్లి ఆవు, ఎద్దు గొంతులో గుచ్చుకోవా?’ అని.


అప్పుడు రైతు తన కొడుకును ఎద్దు ముందు కూర్చోబెట్టి, దానికి కాస్త చొప్ప వేశాడు. అది చొప్పలను మొదలు నుంచి కొంచెం, కొంచెం నోట్లోకి లాక్కొని, బాగా నమిలి మింగుతూ, మళ్లీ కొంత చొప్పను నోట్లోకి లాక్కుంటూ మొత్తం తినేసింది. అది చూసాక రైతు కొడుక్కి తనెలాంటి అర్థంలేని ప్రశ్న వేశాడో స్పష్టమైంది’ అని మాస్టారు చెప్పిన సమాధానంతో ఆంజనేయులకు తాను ఇప్పటివరకు ఎలాంటి ప్రశ్నలు వేసి మాస్టార్లను ఇబ్బందిపెట్టాడో అర్థమైంది. ఇక నుంచి పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, సరైన ప్రశ్నలు వేసి తన అనుమానాలు నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

– డా. కొప్పరపు నారాయణ మూర్తి,

76719 09759.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్