హాయ్ పిల్లలూ,
ఈరోజు గణిత ప్రక్రియలలో ఒకటైన భాగహారం గురించి తెలుసుకుందాం. అదీ భాగహారం చేయకుండానే ఒక సంఖ్య మరో సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో ఎలా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం! సాధారణంగా ఏదైనా ఒక సంఖ్య మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో భాగించకుండానే చెప్పడానికి ఉపయోగించే నియమాన్ని భాజనీయత సూత్రం అంటారు. ప్రాథమిక స్థాయి తరగతులలో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంఖ్యల భాజనీయత సూత్రాలను నేర్చుకున్నాము. ఇప్పుడు 11, 13 సంఖ్యల భాజనీయత సూత్రాలను తెలుసుకుందాం.
11 యొక్క భాజనీయత సూత్రం
ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకెను మిగిలిన సంఖ్య నుండి తీసివేస్తూ రావాలి. ఇలా చేస్తూ ఉండగా చివరకు వచ్చిన రెండంకెల సంఖ్య 11 గుణిజమైతే, ఆ అసలు సంఖ్య 11చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదాహరణ: 8316 అనే సంఖ్య 11చే నిశ్శేషంగా భాగింపబడుతుందా?
సాధన:
8316
= 8316
(–) 6
-----
825 (–) 5 = 77
77 అనేది 11 గుణిజం. కాబట్టి 8316 అనే సంఖ్య 11చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
13 యొక్క భాజనీయత సూత్రం
ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకెను 4చే గుణించి, వచ్చిన లబ్ధాన్ని మిగిలిన సంఖ్యకు కలపాలి. వచ్చిన సంఖ్యకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ, చివరకు రెండంకెల సంఖ్య వచ్చేవరకు చేయాలి. ఆ సంఖ్య 13 గుణిజమైతే, తీసుకున్న సంఖ్య 13చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
ఉదాహరణ: 975
సాధన: 975
= 975 (5 × 4 = 20)
(+) 20
------
117 (7 × 4 = 28)
(+) 28
------
39
39 అనేది 13 గుణిజం. కాబట్టి 975 అనే సంఖ్య 13చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
– మడ్డు తిరుపతి రావు
గణిత అవధాని & టీచరు
బూరగాం, కంచిలి, శ్రీకాకుళం.
94913 26473








కామెంట్‌లు (0)