ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదురాశ..

1 గంట క్రితం

nakka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 07:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక అడవిలో కుబుద్ధి అనే నక్క నివసిస్తూ ఉండేది. అది ఎవ్వరికీ ఏ సహాయం చేసేది కాదు. కానీ అందరూ తనకి సహాయం చేయాలి అనుకునేది. ఒక రోజు అది ఎంత కష్టపడినా వేటాడడానికి ఏ జంతువు దొరకలేదు. కుబుద్ధి ఆకలితో నకనకలాడిపోతోంది. అది కాళ్ళు ఈడ్చుకుంటూ అడివంతా తిరగసాగింది. ఆఖరికి దాని అదృష్టం పండింది. ఒక చెట్టుకింద ఒక కుందేలు చనిపోయి పడి ఉంది. పక్కనే ఒక పాము కళేబరం, ఒక వేటగాడి మృత శరీరం, అతను వాడిన ధనుస్సు కనిపించాయి. అప్పుడు కుబుద్ధి సంతోషానికి అవధులు లేవు. తనకి వారం రోజులకి సరిపడా తిండి ఉంది అనుకుంది. అంతలో ఆ చెట్టు పైన భార్య ,పిల్లలతో సహా కాపురముంటున్న ఒక కాకి “నక్కబావా ఈ మధ్య కనిపించడం మానేసేవు?”అని అడిగింది .

“ఏం చెప్పను కాకి బావా పది రోజులనించి తిండితిప్పలు లేకుండా తిరుగుతున్నాను.నీరసం వచ్చేసింది “అంది కుబుద్ధి అవలీలగా అబద్ధం చెపుతూ.

“పోనీలే బావా.చెట్టు కింద బోలెడు నీకిష్టమైన ఆహారం ఉంది. ఇక్కడ ఒక వేటగాడు బాణంతో కుందేలుని చంపాడు. అదే సమయానికి చెట్టు తొర్రలో ఉన్న పాము అతన్ని కాటేసింది. వేటగాడు ఒక పక్క ప్రాణం పోతుంటే తన ధనుస్సు కర్రతో పాముని బాది చంపేసాడు. తరువాత అతని ప్రాణం పోయిందనుకో. కుందేలుని నువ్వు కొంచెం తిని వదిలేస్తే , తరువాత రాబందు అన్న కొంత తింటాడు. ఇంకా ఏదైనా కొంచెం మిగిలితే నా కుటుంబానికి ఒక రెండు రోజులు ఆకలి బాధ లేకుండా ఉంటుంది”అంది కాకి.

కుబుద్ధికి అలా తను కొంచెం తినేసి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. మొత్తం అక్కడే మకాం వేసి అంతా తినేసి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అది అలోచించి ‘ముందు ధనుస్సుకి జంతువు నరంతో కట్టిన తాడు నుంచి తినడం మొదలు పెడతాను. అది మాత్రం వదులుకోవడం ఎందుకు?’ అనుకుంది.ఆ తాడు కొరకగానే ఒక్కసారిగా తాడు తెగి ధనస్సు కర్ర కుబుద్ధి తల మీద గట్టిగా తగిలింది.దానితో అది గిలగిలలాడుతూ ప్రాణం విడిచింది.అంత ఆహారం ముందు ఉండగా అది తినకుండా ,ఎవరికీ ఏదీ మిగల్చకూడదు, అన్న దురాశతో ధనుస్సు తాడు కొరికి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు పెద్దలు.

ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్