వాషింగ్టన్ : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆంక్షల ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ, అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందనే దానిపై స్పష్టత లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల నేపథ్యంలో ఈ వారంలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఐసిసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు ఇతర ఇజ్రాయెల్ నేతలపై జారీ చేసిన అరెస్టు వారెంట్లు, ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనికులపై గతంలో చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికా గతంలో ఐసిసికి చెందిన పలువురు అధికారులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లపై ఆంక్షలు విధించింది. ఆగస్టు 18న ఐసిసి అధ్యక్షురాలు టొమోకో అకానే, సీనియర్ ట్రయల్ లాయర్ అబ్దులాయే సెయేపై కూడా ఆంక్షలు విధించింది.
ఐసిసిని దౌత్యపరంగా ఒంటరి చేసేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జులైలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇతర దేశాలు ఐసిసి నుంచి వైదొలగాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా ఇప్పటివరకు కోర్టు అధికారులపై మాత్రమే ఆంక్షలు విధించగా, ఇప్పుడు మొత్తం సంస్థను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి మరింత పెరగనుంది. సంస్థవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వస్తే అమెరికా పౌరులు, కంపెనీలు ఐసిసికి నిధులు, వస్తువులు లేదా సేవలు అందించాలంటే అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఒఎఫ్‌ఎసి) నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న బ్యాంకులు కూడా ఇటువంటి ఆంక్షల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో ఐసిసికి ఐటీ సేవలు, బీమా, దర్యాప్తు సిబ్బంది నియామకం, రోజువారీ ఆర్థిక లావాదేవీలు, అమెరికన్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు వంటి కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కోర్టు అధికారులు హెచ్చరించారు. యుద్ధ నేరాలు, నరమేధం, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపేందుకు 2002లో ఐసిసి ఏర్పాటైంది. సంబంధిత దేశం స్వయంగా విచారణ జరపలేనప్పుడు లేదా అందుకు సిద్ధంగా లేనప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఐసిసి తన అధికార పరిధిని వినియోగిస్తుంది. అమెరికా మాత్రం ఐసిసి సభ్యదేశంగా ఎప్పుడూ లేదు.








కామెంట్‌లు (0)